ఓ విద్యార్ధి నిర్వాకం: చైన్ స్నాచింగ్‌లు, మామ ఇంట్లో చోరీ, గోవాలో జల్సా...!
హైదరాబాద్: విద్యార్ధిగా చదువుపై దృష్టిపెట్టాల్సిన ఓ యవకుడు జల్సాలకు అలవాటు పడ్డాడు. చైన్ స్నాచర్‌గా అవతారమెత్తాడు. అంతేకాదు బంధువుల ఇళ్లకు వెళ్లినప్పుడు వస్తువులు దొంగిలించేవాడు. పోలీసులకు కూడా దొరికిపోయాడు. జైలు నుంచి బయటకు వచ్చాక ప్రవర్తన మార్చుకున్నానని తల్లిదండ్రులకు అబద్ధం చెప్పాడు.
ఓ సారి దొరికిపోయినా, మళ్లీ స్నేహితులతో కలిసి సొంత మామ ఇంటిలోనే దోపిడీ చేశాడు. దోచుకున్న సొత్తుతో ఇద్దరూ గోవా వెళ్లి జల్సాలూ చేశారు. పాత నేరస్థుల సర్వేలో భాగంగా సీసీఎస్ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకుంటే ఇవన్నీ వెలుగుచూశాయి.
హైదరాబాద్ పాత మలక్‌పేట్‌కు చెందిన అజీమ్ అహ్మద్ సిద్దిఖీ(19) స్టోరీ ఇది. డిగ్రీ చదువుతున్నాడు. ఈ మధ్య కాలంలో నగరంలో వరుసగా జరుగుతున్న చైన్ స్నాచింగ్‌ల నేపథ్యంలో గతంలో చైన్‌స్నాచింగ్‌లు చేసిన చరిత్ర ఉన్న అజీమ్ అహ్మద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
ఏడాది క్రితం అతడి మామ ఇంట్లో చేసిన దొంగతనాన్ని కూడా బయటపెట్టాడు. చైన్ స్నాచింగ్‌ల్లో ఆరి తేరిన అజీమ్‌తో పాటు అతడి స్నేహితుడైన మరో విద్యార్థిని హైదరాబాద్ సీసీఎస్ ఈస్ట్‌జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 46 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ జాయింట్ కమిషనర్ టి. ప్రభాకరరావు ఈ మేరకు వివరాలు వెల్లడించారు.

అజీమ్ అహ్మద్ సిద్ధిఖీ తన సహచరులైన మౌసిన, అజీమ్‌తో కలిసి 2012లో నగరంలోని చాదర్‌ఘాట్, సైఫాబాద్, హుమాయున నగర్, లంగర్‌హౌస్, అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో 12 చైన స్నాచింగ్‌లు చేశాడని ఆయన తెలిపారు. కాగా, మలక్‌పేట అక్బర్‌బాగ్‌కు చెందిన సిద్ధిఖీ మామ తాజాముల్ అహ్మద్‌ఖాన జీవనోపాధి కోసం ఏడాది కిందట కుటుంబ సమేతంగా దుబాయ్ వెళ్లాడు.
ప్రణాళిక ప్రకారం అంతక ముందే ఇంటి తాళాలకు డూప్లికేట్ తయారుచేసి పెట్టుకున్న సిద్దిఖీ తన స్నేహితుడైన అక్బర్‌బాగ్‌కు చెందిన మరో విద్యార్థి మహ్మద్ అబ్దుల్ ఖ్వావి అలియాస్ సోహైల్‌తో కలిసి అహ్మద్‌ఖాన్ ఇంటికి వెళ్లాడు. డూప్లికేట్ తాళాలతో ఇల్లు తెరచి బీరువాలో 60 తులాల బంగారు నగలు, రూ.1.50 లక్షల నగదు దొంగిలించారు.
14 తులాల బంగారాన్ని అమ్మి బైక్‌లను కొన్నారు. గోవా వెళ్లి జల్సాలు చేసి తిరిగి వచ్చారు. తాజాముల్‌కు అనుమానం రాకుండా బైక్‌లను అమ్మేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో నగరానికి వచ్చిన తాజాముల్ చోరిని గుర్తించి చాదర్‌ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చివరకు చైన్ స్నాచింగ్‌ల అనుమానంతో సీసీఎస్ ఈస్ట్‌జోన్ ఏసీపీ విజయ్ కుమార్ శుక్రవారం రాత్రి అజీమ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఈ నేరాలు వెలుగుచూశాయి.












Click it and Unblock the Notifications