అటు కేసీఆర్..ఇటు వైఎస్ జగన్: ఒకేరోజు
హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్‌లో సమతామూర్తి శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. త్రిదండి చినజీయర్ స్వామి చేపట్టిన రామానుజుల సహస్రాబ్ది సమారోహం ఈ నెల 2వ తేదిన ప్రారంభమైంది. 14న ముగుస్తుంది. ఈ వేడుకల్లో భాగంగా ఆశ్రమంలో 1,035 కుండాలతో శ్రీలక్ష్మీనారాయణ యాగాన్ని నిర్వహిస్తోన్నారు రుత్విక్కులు. 216 అడుగుల ఎత్తు ఉన్న సమతామూర్తి, జగద్గురు రామనుజాచార్య విగ్రహాన్ని రెండు రోజుల కిందటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు.
అంగరంగ వైభవంగా సాగుతోన్న రామానుజ సహస్రాబ్ది సమారోహ వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ సాయంత్రం ఆయన ముచ్చింతల్ చినజీయర్ స్వామివారి ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొననున్నారు. రామానుజాచార్యుల విగ్రహానికి పూజలు నిర్వహించనున్నారు. ఈ మధ్యాహ్నం 3.20 నిమిషాలకు వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి, గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
3.50 నిమిషాలకు అక్కడి నుంచి బయలుదేరుతారు. 4.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చినజీయర్ ఆశ్రమానికి వెళ్తారు. సాయంత్రం 5 గంటల నుంచి 7.30 గంటల వరకు అక్కడే ఉంటారు. లక్ష్మీనారాయణ మహాయాగంలో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు ఆశ్రమం నుంచి బయలుదేరుతారు. 9.05 నిమిషాలకు క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు. కాగా, శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం ఉత్సవాలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

మంగళవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముచ్చింతల్‌కు రానున్నారు. ఎల్లుండి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, 10వ తేదీన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆశ్రమాన్ని సందర్శిస్తారు. 11వ తేదీన జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, 12వ తేదీన ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, 13వ తేదీన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్..చినజీయర్ స్వామివారి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. సమతామూర్తి విగ్రహానికి పూజలు నిర్వహిస్తారు.
మరోవంక- యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించనున్నారు. ఈ ఉదయం 11 గంటలకు ఆయన యాదాద్రికి చేరుకుంటారు. బాలాలయంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలిస్తారు. ఆలయ మహాకుంభ సంప్రోక్షణ కోసం చేపట్టిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. మార్చి 22 నుంచి 28వ తేదీ వరకు యాదాద్రి ఆలయం పునఃప్రారంభోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి జరుగుతున్న ఏర్పాట్లపై కేసీఆర్ ఆరా తీస్తారు.












Click it and Unblock the Notifications