షర్మిల మాటే నెగ్గిందా, వారంతా ఒక్కటయ్యారు - ఢిల్లీలో కొత్త గేమ్..!!
వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ లో రూట్ క్లియర్ అయింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ అభ్యంతరాలను పార్టీ నాయకత్వం పక్కన పెట్టింది. షర్మిల కోరుకున్న విధంగా తెలంగాణలో ప్రాధాన్యత ఇచ్చేందుకు నిర్ణయించింది. ఆ తరువాత ఏపీలో ప్రచారానికి షర్మిల అంగీకరించారు. దీంతో కాంగ్రెస్ లో చేరేందుకు అధికారికంగా ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈ సమయంలోనే కాంగ్రెస్ లో రేవంత్ ప్రత్యర్ధులు షర్మిలకు మద్దతుగా నిలుస్తున్నారనే వాదన మొదలైంది.
కుదిరిన ఒప్పందం : వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరటం పై కొంత కాలంగా డైలమా కొనసాగుతోంది. తెలంగాణలోనే తాను పరిమితం అవుతానని షర్మిల షరతు విధించారు. తెలంగాణలో షర్మిల కు పార్టీ బాధ్యతలు వద్దనేది రేవంత్ తో పాటుగా ఆయన మద్దతు దారులు ఢిల్లీలో పార్టీ నేతలకు మొర పెట్టుకున్నారు.

షర్మిల ను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చే విషయంలో తొలి నుంచి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. షర్మిల రాక పైన అభ్యంతరాలు సరి కాదని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో షర్మిలతో ఫోన్ లో మాట్లాడిన ప్రియాంక వైఎస్సార్టీపీని విలీనం చేయాలని ప్రతిపాదించారు. తొలుత అందుకు షర్మిల నో చెప్పినా..ఇప్పుడు అంగీకరించారు.
ఢిల్లీలో భారీ మంత్రాంగం : అదే సమయంలో షర్మిల కోరుకున్న విధంగా తెలంగాణ కాంగ్రెస్ లో పని చేయటానికి హైకమాండ్ ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం. అదే సమయంలో ఏపీలోనూ పార్టీ నేతగా బాధ్యతలు చూడాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు షర్మిల అంగీకరించటంతో ఈ నెల 23న షర్మిల కాంగ్రెస్ లో చేరటానికి ముహూర్తంగా నిర్ణయించినట్లు చెబుతున్నారు.
ఇక షర్మిల రాకపైన రేవంత్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సమయంలో నాడు వైఎస్ తో సన్నిహితంగా మెలిగిన నేతలంతా ఒక్కటయ్యారు. పార్టీ కోసం పైకి కలిసి ఉన్నట్లుగా ఉన్నా, రేవంత్ తీరు పైన వ్యతిరేకంగా ఉన్న వారంతా ఢిల్లీ పార్టీ ముఖ్యుల వద్ద షర్మిల కు పార్టీలో ప్రాధాన్యత గురించి కీలక మంత్రాంగం నడిపారు.

కాంగ్రెస్ నేతగా షర్మిల : అందులో భాగంగానే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. షర్మిల రాకను ఎవరూ అభ్యంతర పెట్టాల్సిన అవసరం లేదన్నారు. మరో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే తరహా అభిప్రాయం పార్టీ ముఖ్య నేతల వద్ద వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
షర్మిల పార్టీలోకి రావటం ద్వారా వైఎస్సార్ అభిమానులతో పాటుగా, ప్రధాన వర్గాల మద్దతు మరింత పెరుగుతుందని వైఎస్ విధేయ నేతలు పార్టీ హైకమాండ్ వద్ద వివరించినట్లు సమాచారం. ఢిల్లీలో జరిగిన ముమ్మర మంత్రాంగంతో ఎట్టకేలకు పార్టీ హైకమాండ్ షర్మిల డిమాండ్ కు అంగీకారం తెలిపింది. దీంతో, షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి.. కాంగ్రెస్ తరపున కొత్త పాత్ర పోషించటానికి సిద్దమయ్యారు.












Click it and Unblock the Notifications