చెప్పేవి శ్రీరంగనీతులు చేసేవి పనికిమాలిన పనులు: కవితకు వైఎస్ షర్మిల చురకలు
సుఖేష్ చంద్రశేఖర్ కు తనకు ఎటువంటి పరిచయం లేదని, తాజాగా తనపై జరుగుతున్న ప్రచారంపై ఎమ్మెల్సీ కవిత తనదైన శైలిలో స్పందించారు. ఇక కవిత వ్యాఖ్యల నేపథ్యంలో కవితను టార్గెట్ చేస్తూ వైయస్ షర్మిల ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు.
అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు అమ్మ కవితమ్మ.. నీ బండారం బట్టబయలు అయితే, అవి మీడియా ప్రసారం చేస్తే, పాత్రికేయులకు మీడియా సంస్థలకు విలువల్లేవని మాట్లాడుతున్న నీకు ఏం విలువలు ఉన్నట్టు? అంటూ వైయస్ షర్మిల ప్రశ్నించారు. బతుకమ్మ ముసుగులో లిక్కర్ దందా చేసి, తెలంగాణ ఆడబిడ్డల ఇజ్జత్ తీసిన కవితమ్మ బురద చల్లడం అంటే ఏంటి జర చెప్పమ్మా అంటూ వైయస్ షర్మిల చురకలు అంటించారు.

లిక్కర్ స్కాంలో రోజుకో ఎపిసోడ్ బయట పడుతుంటే నిజాలు రాయకుండా.. లిక్కర్ స్కాంతో ఘనకార్యం చేశావని నెత్తిన పెట్టుకోవాలా? అంటూ ప్రశ్నించారు. ఆహా! ఓహో అని వార్తలు రాయాలా? చెప్పాలన్నారు. లిక్కర్ డాన్, లిక్కర్ క్వీన్ అంటూ బిరుదులు ఇయ్యమంటావా? అంటూ షర్మిల కవితపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఒక అనామకుడు ఆరోపణలు చేస్తే మీ నాన్న ఈటల రాజేందర్ ను పార్టీలో నుంచి సస్పెండ్ చేశారని గుర్తు చేసిన షర్మిల లిక్కర్ కుంభకోణానికి పాల్పడిన నిన్ను సస్పెండ్ చేయకుండా రాచ మర్యాదలతో కేసీఆర్ ప్రగతి భవన్లో స్వాగతం పలికారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిడ్డను కాపాడుకోవడానికి ఢిల్లీ వీధుల్లో కేసీఆర్ తిరిగారని, తోడుదొంగలంతా ఒకటైనట్టు మంత్రులంతా విరామం లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి పొగిడారని షర్మిల ఎద్దేవా చేశారు.
నువ్వు నిజంగా అవినీతికి పాల్పడకపోతే నీ పదవికి రాజీనామా చేసి తెలంగాణ ప్రజల ముందు నీ నిజాయితీ నిరూపించుకోమంటూ సవాల్ విసిరారు. చెప్పేవి శ్రీరంగనీతులు చేసేవి పనికిమాలిన పనులు అంటూ కవితను టార్గెట్ చేసిన వైయస్ షర్మిల నువ్వు చేసిన తప్పుకు తెలంగాణ ప్రజలు నిలదీస్తారు కానీ ఎప్పటికీ తలవంచరు అంటూ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications