సోనియాతో షర్మిల భేటీ - డీకే రాయబారం, ముహూర్తం ఫిక్స్..!?
తెలుగు రాజకీయాల్లో మరో కీలక పరిణామం. కొంత కాలంగా వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం సాగుతోంది. షర్మిల సైతం అవే సంకేతాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో షర్మిల కాంగ్రెస్ లోకి అధికారికంగా ఎంట్రీ ఇచ్చేముందు నేరుగా సోనియాతో భేటీ కానున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లోని కీలక నేతలు షర్మిల రాక పైన కండీషన్లు పెడుతున్న సమయంలో..నేరుగా సోనియాతో చర్చించాలని షర్మిల నిర్ణయించారు.
సోనియాతో షర్మిల భేటీ వేళ: నాడు వైఎస్ మరణం తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో ఆయన కుటుంబం కాంగ్రెస్ కు దూరమైంది. ఇప్పుడు వైఎస్ కుమార్తె షర్మిల తిరిగి కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్దమైంది. ఈ నెల 17, 18 తేదీల్లో బెంగుళూరులో జాతీయ స్థాయిలోని అన్ని బీజేపీ వ్యతిరేక పార్టీల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సోనియా గాంధీ హాజరు కానున్నారు.

ఈ సమయంలోనే వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల బెంగళూరు లో సోనియాతో భేటీ కానున్నారు. ఈ మేరకు తొలి నుంచి షర్మిలను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేందుకు మధ్యవర్తిత్వం వ్యవహరిస్తున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అప్పాయింట్ మెంట్ ఖరారు చేయించినట్లు విశ్వసనీయ సమాచారం.
షర్మిలకు స్పష్టమైన హామీలతో: షర్మిల పార్టీలో చేరటం పైన చర్చల సమావేశంలో వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం పైన ప్రతిపాదనలు వచ్చాయి. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తేనే తదుపరి చర్చలు ఉంటాయని షర్మిల భర్తకు కాంగ్రెస్ ముఖ్య నేత కేసీ వేణుగోపాల్ స్పష్టం చేసినట్లుగా సమాచారం. ఇప్పుడు సోనియాతో షర్మిల భేటీ సమయంలో విలీనం దిశగా అంగీకారం చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది.
షర్మిలను తెలంగాణ పార్టీ వ్యవహారాల్లో కాకుండా ఏపీకి పరిమితం చేయాలని టీ కాంగ్రెస్ లోని కొందరు ముఖ్యులు పార్టీకి సూచిస్తున్నారు. షర్మిల తాను తెలంగాణకు పరిమితం అవుతానని చెబుతున్నారు. ఈ క్రమంలో సోనియాతో భేటీ ద్వారా..తన ఆలోచనలను షర్మిల స్పష్టం చేసే అవకాశం కనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో షర్మిల సేవలు: షర్మిలను కాంగ్రెస్ లో చేర్చుకొని ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. చాలా కాలం తరువాత తాజాగా వైఎస్సార్ జన్మదినం నాడు పార్టీ ముఖ్య నేతలు రాహుల్, ఖర్గే చేసిన ట్వీట్ల ద్వారా వైఎస్సార్ కు ఇంకా ప్రాధాన్యత ఉందనే సంకేతాలు ఇచ్చారు.
తెలంగాణ ఎన్నికల పైన ముందుగా ఫోకస్ చేసిన కాంగ్రెస్ , ఆ తరువాత షర్మిల సేవలను ఏపీలో వినియోగించుకోవాలనే ఆలోచనలో ఉంది. సోనియాతో చర్చల సమయంలో పార్టీలో షర్మిలకు దక్కే ప్రాధాన్యత..బాధ్యతల పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సోనియాతో భేటీ తరువాత అధికారికంగా షర్మిల కాంగ్రెస్ లో చేరుతారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications