Tirumala స్వామి భక్తి: టీటీడీకి కోటి రూపాయల భారీ విరాళం ఇచ్చిన హైదరాబాదీ మహిళ!!
టీటీడీ ఆరోగ్యశ్రీ వరప్రసాదినికి భర్త పేరుతో ఓ హైదరాబాదీ మహిళ రూ.కోటి భారీ విరాళం అందించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల కొండలపై కొలువైన వెంకటేశ్వర స్వామికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. కోరికలు కోరుకున్నంతనే తీర్చే వెంకటేశ్వర స్వామికి నిత్యం లక్షలాదిమంది భక్తులు భారీగా మొక్కులు చెల్లించుకుంటారు. తిరుమల శ్రీవారిని నమ్ముకుంటే జీవితంలో అన్నీ నెరవేరుతాయి అని నమ్మే భక్తులు అశేషంగా ఉన్నారు. తిరుమల శ్రీనివాసుడికి భక్తితో అనేక భారీ కానుకలు సమర్పించే వారి సైతం లేకపోలేదు.

తిరుమల శ్రీవారికి కోటి రూపాయల భారీ విరాళం
ఇక తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానానికి హైదరాబాద్ కు చెందిన ఒక భక్తురాలు భారీ విరాళాన్ని అందించారు. హైదరాబాద్ కు చెందిన వడ్లమూడి సరోజిని తిరుమల శ్రీవారికి కోటి రూపాయలు విరాళాన్ని అందించారు. తిరుమల శ్రీవారిపై భక్తి భావంతో ఆమె తన భర్త వడ్లమూడి రమేష్ బాబు జ్ఞాపకార్థం కోటి రూపాయల విరాళాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆరోగ్యశ్రీ వరప్రసాదిని పథకానికి అందించి ఆ దేవదేవుడి పై తన భక్తిని చాటుకున్నారు. ఈ మేరకు దాతల కార్యాలయంలో ఆమె కోటి రూపాయల డిడి ని అందజేశారు. అలాగే శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక ఇటీవల చెన్నైకి చెందిన రోహిణి ఎంటర్ ప్రైజెస్ సంస్థ తిరుమల స్వామి వారికి 10లక్షల రూపాయల విరాళం అందించింది.

స్వామి వారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు న్యాయమూర్తి
ఇదిలా ఉంటే తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్ నిన్న వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం ఇవ్వగా, ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందించారు. ఇక తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కూడా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.

స్వామి దర్శనానికి 24 గంటల సమయం
ఇదిలా ఉంటే శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య వారాంతం కావడంతో ఎక్కువగా ఉంది. ఆదివారం సాయంత్రానికి ఎస్ఎస్డి టోకెన్లు లేకుండా క్యూలైన్లో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 14 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి 24 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం లభిస్తుందని అధికారులు వెల్లడించారు. కాగా ఆదివారం రోజు తిరుమల శ్రీవారిని 74,994 మంది దర్శించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3.59 కోట్లు వచ్చినట్టు టిటిడి వెల్లడించింది. ఆదివారం నాడు మొత్తం 25,799 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నట్టు పేర్కొంది.












Click it and Unblock the Notifications