వేసవిలో తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్-
తిరుపతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. మహాశివరాత్రి పర్వదినంతోపాటు ఆదివారం సెలవు రోజు కావడం వల్ల పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటోన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండి పోయాయి. క్యూలైన్లలో భక్తులు బారులు తీరి నిల్చోన్నారు.

సర్వదర్శనానికి..
ఫలితంగా- శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 10 నుంచి 12 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ కింద దర్శనానికి వచ్చే భక్తులకు అయిదు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. మహాశివరాత్రి పండగ నాడు 71,350 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 28,912 మంది తలనీలాలను సమర్పించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి హుండీ ద్వారా వచ్చిన ఆదాయం 3.47 కోట్ల రూపాయలు.

పరీక్షల హడావుడి ముగియగానే..
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వివిధ రకాల పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్స్ వెలువడిన విషయం తెలిసిందే. విద్యార్థులు వాటికి సన్నద్ధమౌతోన్నారు. ఈ షెడ్యూల్స్ అన్నీ ముగిసిన తరువాత తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు. వేసవి సెలవుల్లో శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, దీనికి అనుగుణంగా ముందస్తు చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.

ఏసీ బస్సులు..
ఈ పరిస్థితుల మధ్య ఏపీఎస్ఆర్టీసీ అధికారులు శ్రీవారి భక్తులకు శుభవార్త వినిపించారు. వేసవి తిరుమలకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా ఏసీ బస్సులను నడిపించబోతోన్నారు. అవి ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకుని రానున్నారు. తిరుపతి నుంచి వివిధ జిల్లాల మధ్య ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ప్రవేశపెట్టడానికి అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ బస్సులను ఎప్పటి నుంచి నడిపించాలనే విషయాన్ని త్వరలోనే ఖరారు చేయనున్నారు.

గ్రీన్ సప్తగిరి..
గ్రీన్ సప్తగిరి పేరుతో ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడిపించనున్నారు ఆర్టీసీ అధికారులు. మలి విడతలో తిరుపతి-కడప, తిరుపతి-నెల్లూరు, తిరుపతి-మదనపల్లి మధ్య వీటిని రోడ్డెక్కించడానికి సన్నాహాలు చేపట్టారు. త్వరలోనే అవి అందుబాటులోకి రానున్నాయి. వేసవి సెలవుల నాటికల్లా ఆయా బస్సులను ప్రయాణికులకు తమ సేవలను అందించడానికి రెడీ కానున్నాయి. జీరో ఎమిషన్ బస్సులు అవి. డీజిల్ కు బదులుగా విద్యుత్ ఛార్జింగ్ ద్వారా నడుస్తాయి.












Click it and Unblock the Notifications