ఆ మహిళకు 18 మంది భర్తలా ? తిరుపతిలో ఎమ్మెల్సీ దొంగ ఓట్లపై సీపీఐ నారాయణ ఫైర్
ఏపీలో పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా భారీ ఎత్తున అధికార పార్టీ దొంగఓట్లు నమోదు చేయిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
తిరుపతి : ఏపీలో జరుగుతున్న పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార వైసీపీతో పాటు విపక్షాలకూ ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇందులో ఆయా పార్టీల అభ్యర్ధుల గెలుపోటములు వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అన్ని పార్టీలు వీటిని సీరియస్ గా తీసుకున్నాయి. ఇదే క్రమంలో అధికార వైసీపీ దొంగఓట్లు నమోదు చేయించి ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని సీపీఐ జాతీయనేత నారాయణ ( CPI Narayana ) మండిపడ్డారు.
తిరుపతిలో వైసీపీ నేతలు దొంగఓట్లు నమోదు చేయించినట్లు ఆరోపణలు వచ్చిన ఇళ్లను తాజాగా సీపీఐ నారాయణ సందర్శించారు. అక్కడ ఓట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నారాయణ వైసీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాభారతంలో ద్రౌపదికి ఐదుగురు భర్తలని విన్నాం కానీ జగన్‌రెడ్డి ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కేబీ లేఅవుట్‌లోని ఓ మహిళకు 18 మంది భర్తలున్నట్లు నమోదు చేయడం సిగ్గు చేటని నారాయణ విమర్శించారు. దొంగ ఓట్ల కోసం వైసీపీ నేతలు ఇలా చూపడం సిగ్గుచేటన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తిరుపతిలోని కొన్ని డివిజన్లలో నారాయణ పర్యటించారు. ఓ ఇంట్లో 30, మరో నివాసంలో 11 ఓట్లు నమోదు చేసుండటాన్ని నారాయణ గుర్తించారు. యశోదనగర్ 18-1-90/12జి ఖాళీ ప్రదేశంలో పది దొంగ ఓట్లున్నట్లు తెలుసుకున్నారు. ఒకటో క్రాస్ వలంటీర్ ఇంట్లో 12 ఓట్లు ఉన్నట్లు గుర్తించారు. సీపీఎం ఆఫీసు పక్కన లక్ష్మి ఇంట్లో ఎనిమిది దొంగ ఓట్లు ఉన్నట్లు గుర్తించారు. ఓటమి భయంతోనే ఏ చదువూ లేనివారికీ వైసీపీ ప్రభుత్వం గ్రాడ్యుయేట్ ఓటు అర్హత కల్పించడం దారుణమని నారాయణ విమర్శించారు.
తిరుపతి నగరంలోనే ఏడువేల దొంగ ఓట్లున్నట్లు తెలిపారు. దొంగ ఓట్ల నమోదుకు సహకరించిన అధికారిని ఉరితీయాలన్నారు. టీటీడీ చైర్మన్‌గా పనిచేసిన ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నియోజకవర్గంలో దొంగ ఓట్ల దందా కొనసాగుతుండడం దుర్గార్మమని నారాయణ తెలిపారు. దొంగ ఓట్ల సాయంతో గెలిచేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. దొంగ ఓట్లు వేయడానికి వచ్చినవారి కాళ్లు విరగ్గొట్టాలన్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా పీడీఎఫ్ అభ్యర్థుల విజయం తథ్యమని నారాయణ జోస్యం చెప్పారు. దొంగ ఓట్ల జాబితా, అర్హత కలిగినా ఓటు హక్కు కల్పించకపోవడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications