తిరుమలలో బ్రేక్ దర్శనాలు రద్దు..!
Ugadi 2024: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. వేలాదిమంది స్వామివారిని దర్శించుకుంటోన్నారు. తమ మొక్కులను చెల్లించుకుంటోన్నారు. ఆదివారం నాడు 81,224 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 24,093 మంది తలనీలాలను సమర్పించారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.35 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
అదే రద్దీ కొనసాగుతోంది. 21 కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు వేచి ఉంటోన్నారు. సర్వదర్శనం టోకెన్లను పొందిన భక్తులకు స్వామివారి దర్శనానికి 15 నుంచి 17 గంటల సమయం పడుతోంది. వేసవి సెలవుల వల్ల రద్దీ భారీగా ఏర్పడింది. మున్ముందు మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. దీనికి అనుగుణంగా టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోన్నారు.

ఈ నెల 9వ తేదీన తెలుగు సంవత్సరాది ఉగాది పండగ. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండగను అత్యంత వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటోన్నారు. అదే రోజున వేలాదిమంది భక్తుల సమక్షంలో శ్రీవారి ఆలయంలో తెలుగు సంవత్సరాది ఉగాది ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా చేపట్టనున్నారు.
ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 2వ తేదీన మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆ రోజున ఆలయ శుద్ధి చేస్తారు అర్చకులు. ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి.. తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేస్తారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేస్తారు.
సంవత్సరంలో నాలుగుసార్లు అంటే- ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు.
అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేకపూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతి ఇస్తారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మంగళవారం నాడు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications