తిరుపతిలో ఒకటే కోలాహలం
TTD: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. నేడు జరుగనున్న పంచమి తీర్థంతో ఇవి ముగియనున్నాయి. పంచమీతర్థాన్ని విజయవంతం చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇందులో భాగంగా శ్రీవారి సారెను ఊరేగింపుగా పద్మావతి అమ్మవారి ఆలయానికి తీసుకువస్తారు. అలిపిరి వద్ద ఈ ఊరేగింపు ప్రారంభమౌతుంది. అక్కడి నుంచి కోదండరామస్వామి ఆలయం, గోవిందరాజస్వామి ఆలయం, తిరుచానూరులోని పసుపు మండపం మీదుగా సారెను అమ్మవారి ఆలయానికి తీసుకొస్తారు. అనంతరం పంచమి తీర్ధ మండపనికి వేంచేసి అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తారు టీటీడీ అర్చకులు.

అలిపిరి, కోమలమ్మ సత్రం, శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం, శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం, ఆర్టీసీ బస్టాండ్, తిరుచానూరులోని పసుపు మండపం, నవజీవన్ కంటి ఆసుపత్రి వద్ద శ్రీవారి సారె ఊరేగింపు హోల్డింగ్ పాయింట్లు. ఆయా ప్రాంతాల్లో ఊరేగింపును భక్తుల కోసం కొద్దిసేపు ఆపుతారు.
ఈ ఊరేగింపును విజయవంతం చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. భక్తులు వేచి ఉండటానికి నాలుగు ప్రాంతాలలో షెడ్లు వేశారు. తిరుపతి నుంచి తిరుచానూరుకు వచ్చే మార్గంలో ఉన్న అయ్యప్ప స్వామి గుడి, జెడ్పీ హైస్కూల్, పూడి రోడ్డు, తిరుచానూరు రోడ్లల్లో భక్తుల కోసం షెడ్లు వేశారు.
ఆయా షెడ్లల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు. అన్నప్రసాదం, ఆల్ఫాహారం, బాదంపాలు, మంచినీటిని అందిస్తారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి వీలుగా పద్మ పుష్కరిణి వద్ద ప్రత్యేకంగా గేట్లు, బారికేడ్లను ఏర్పాటు చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. పద్మ పుష్కరిణిలో ఉదయం 12 గంటలకు చక్రస్నానం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. పంచమి తీర్థం ప్రభావం రోజంతా ఉంటుందని, భక్తులు సంయమనంతో వ్యవహరించి పుణ్యస్నానాలు చేయాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేస్తోన్నారు.
ఈ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి 1,200 మంది పోలీసులను నియమించారు. అలిపిరి నుంచి తిరుచానూరులోని పసుపు మండపం వరకు శ్రీవారి సారే ఊరేగింపు వరకు ఎక్కడా తొక్కిసలాట చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications