తిరుపతి లోక్‌సభ: వైసీపీ ఆశలన్నీ వాటిపైనే: మధ్యాహ్నానికి క్లియర్ పిక్చర్
తిరుపతి: తిరుపతి లోక్‌సభ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నిక ఫలితాలు ఈ మధ్యాహ్నానికి స్పష్టం కానున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ మృతి వల్ల ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి నిర్వహించిన ఈ ఉప ఎన్నికలో త్రిముఖ పోరు ఏర్పడినప్పటికీ.. వైసీపీదే విజయమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి బరిలో నిలవగా.. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థినిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ పోటీ చేశారు. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ తెలుగుదేశం తరపున పోటీ చేయగా కాంగ్రెస్ తరపున మాజీ ఎంపీ చింతామోహన్ బరిలో ఉన్నారు.
Recommended Video
ఇక తిరుపతి ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, పోలింగ్ వరకు ఉత్కంఠభరిత వాతావరణం కనిపించింది. విపక్ష పార్టీలు జగన్ ప్రభుత్వంపై అస్త్రాలు సంధించాయి. అయినప్పటికీ ప్రజలు మాత్రం సంక్షేమ పథకాల వైపే మొగ్గుచూపినట్లు ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తే అర్థం అవుతోంది. తిరుపతి సీటు తమదేనంటూ కేవలం మెజార్టీ కోసమే చూస్తున్నామని, అదే సమయంలో టీడీపీ - బీజేపీలు రెండో స్థానంకు పోటీ పడుతున్నాయని వైసీపీ ధీమా వ్యక్తం చేసింది.

తిరుపతిలో పోలింగ్ రోజున ఎక్కువగా హడావుడి కనిపించినప్పటికీ... ఆ సీటును అధికార వైసీపీ నిలబెట్టుకుంటోందని ఆరా సంస్థ అంచనా వేసింది. తిరుపతిలో అధికార వైసీపీకి 65.85 శాతం ఓట్లు పడినట్లు ఆరా సంస్థ జోస్యం చెప్పింది. ఇక టీడీపీకి 23.10 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని, బీజేపీ 7.34 శాతంతో మూడో స్థానంకు పరిమితం అవుతుందని తమ సర్వేలో స్పష్టంగా తేలినట్లు ఆరా సంస్థ వెల్లడించింది. ఇతరులకు 3.71 శాతం ఓట్లు పోలైనట్లు వెల్లడించింది.
ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాడీ వేడీగా బీజేపీ తరపున ప్రచారం చేసినప్పటికీ పెద్దగా ఉపయోగం కనిపించలేదని పలు సర్వే సంస్థలు తెలిపాయి. ఇక తిరుపతి ఉపఎన్నిక వేళ పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్ ఓటర్లపై ప్రభావం చూపుతుందని పలువురు భావించినప్పటికీ అదికూడా బెడిసి కొట్టినట్లు ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే అర్థమవుతోందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ ప్రధానంగా మెజారిటీపైనే దృష్టి సారించింది. నాలుగు లక్షలకు పైగా మెజారిటీ వస్తుందనేది వైసీపీ నేతల అంచనా.












Click it and Unblock the Notifications