TTD: నడకదారి భక్తుల దివ్య దర్శనంలో వెసులుబాటు - ఇక నుంచి..!!
Tirumala: నడకదారి భక్తుల రక్షణ కోసం టీటీడీ పలు నిర్ణయాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం నడకదారి మార్గంలో దివ్య దర్శనం టోకెన్లు టీటీడీ జారీ చేస్తోంది. దీనికి సంబందించి టీటీడీ తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో మరి కొంత కాలం తాజా ఆంక్షలను అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. నడకదారి మార్గంలో భక్తుల రాకపోకలు ప్రత్యేకించి చిన్నారుల విషయం లో పలు నిర్ణయాలు ప్రకటించింది.
దివ్య దర్శనం విధానంలో: టీటీడీ చైర్మన్ గా భూమన తొలి విడత హయాంలో కాలి నడక మార్గంలో వచ్చే భక్తుల కోసం దివ్య దర్శనం టోకెన్ల జారీ ప్రారంభించారు. క్రమేణా కాలి నడకన వచ్చే వారి సంఖ్య రోజుకు 15 వేల వరకు చేరింది. ప్రస్తుతం కాలి నడక మార్గంలో వచ్చే భక్తుల కోసం తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీవారి మెట్టు వద్ద రోజుకు 15 వేల దివ్యదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు.

వీరు నడకమార్గంలో గాలిగోపురం వద్ద స్కానింగ్ చేయించుకోవాలి. కానీ, ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణయాల్లొ భాగంగా వీరికి గాలిగోపురం వద్ద స్కానింగ్ మినహాయించారు. నడకమార్గంతో పాటుగా దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు రోడ్డు మార్గంలో కూడా తిరుమలకు వెళ్లవచ్చని ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేసారు.
భక్తుల రక్షణ చర్యలు: దీని ద్వారా దివ్య దర్శనం భక్తులకు వెసులుబాటు కలగనుంది. అలిపిరి, శ్రీవారిమెట్టు నడకమార్గాల్లో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే 12 ఏళ్లలోపు చిన్నపిల్లలను వారి తల్లిదండ్రులతో సహా అనుమతిస్తున్నారు. పెద్దవారిని రాత్రి 10 గంటల వరకు అనుమతి కొనసాగిస్తున్నారు. నడకదారి భక్తులకు సహాయకారిగా ఉండేలా ప్రతి ఒక్కరికీ ఊతకర్ర ఇవ్వాలని నిర్ణయించారు.
ఘాట్ రోడ్లలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ద్విచక్ర వాహనాలను అనుమతిస్తున్నారు. నడకదారుల్లో 500 కెమెరా ట్రాప్ లు ఏర్పాటు చేశామని, అవసరమైతే డ్రోన్లను వినయోగించాలని నిర్ణయించారు.
కాలి నడక మార్గంలో నిర్ణయాలు: భక్తులను గుంపులుగా పంపుతామని, వీరికి సెక్యూరిటీ గార్డులు భద్రతగా ఏర్పాటు చేసారు. సాధు జంతువులకు ఆహారపదార్థాలు అందించడాన్ని, అలాచేసే వారిపైనా, ఆహార పదార్థాలు విక్రయించే వారిపైనా చర్యలు తీసుకుంటామని ఛైర్మన్ హెచ్చరించారు.
నడకదారుల్లో ఉన్న హోటళ్ల నుండి వ్యర్ధాలు వదిలివేయకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. వైల్డ్ లైఫ్ అవుట్ పోస్టులు 24/7 ఏర్పాటు చేసి అనిమల్ ట్రాకర్స్, డాక్టర్లను అందుబాటులో ఉంచేలా టీటీడీ చర్యలు ప్రారంభించింది.












Click it and Unblock the Notifications