వీఐపీ బ్రేక్ దర్శనం పై తాజా అప్ డేట్ - అమ్మవారి నిత్యాన్నదాన వేళల పెంపు..!!
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 17వ తేదీన సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవానికి తిరుమలలో ఒక ప్రత్యేక విశిష్ఠత ఉంది. మూలవిరాట్టుకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదిస్తారు. దీంతో ఆ రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటుగా ఆర్జిత సేవలను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.
ఆణివార ఆస్థానం: ఆణివార ఆస్థానం ప్రత్యేకత శ్రీవారి ఆలయంలో జూలై 17వ తేదీన సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినం ఘనంగా జరుగనుంది. సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతినాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు.

పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినంనాటి నుండి టీటీడీ వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి - ఏప్రిల్ నెలలకు మార్చారు.
17న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు: దీంతో, ఈ నెల 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నెల 16న ఎటువంటి వీఐపీ సిఫారసు లేఖలు అనుమతించబోమని పేర్కొంది. ఈ ఉత్సవం రోజు ఇలా ఈ ఉత్సవం రోజున ఉదయం బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేస్తారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీవిష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేస్తారు.
ఈ ఉత్సవమూర్తులతో పాటు ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదిస్తారు.పెద్ద జీయ్యర్ స్వామి పెద్ద వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేస్తారు. వీటిలో నాలుగింటిని మూలమూర్తికి అలంకరిస్తారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామివారికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరిస్తారు.
అమ్మవారి నిత్యాన్నదాన వేళల పెంపు: సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్పపల్లకీపై తిరుమల పురవీధుల గుండా ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు. ఆస్థానం కారణంగా జూలై 17న కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకారణ సేవలను రద్దు చేసారు.
అటు తిరుచానూరు శ్రీపద్మావని అమ్మవారి నిత్యాన్నదాన వితరణ వేళలను రాత్రి ఏకాంత సేవ ముిగసే వరకు పొడిగిస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిత్యాన్నదానం చేస్తుండగా..ఇక పై రాత్రి పది గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉండనుంది.












Click it and Unblock the Notifications