శ్రీవారి అన్నదాన - లడ్డూ ప్రసాదాలపై టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం..!!
Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వేసవిలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుండటంతో సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. ఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మే 3 నుంచి 13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. రూ.10 లక్షలతో వెండి కవచాన్ని శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి అందించేందుకు ఆమోదం తెలిపింది. ఇదే సమయంలో అన్నదాన ప్రసాదంతో పాటుగా లడ్డు ప్రసాదం విషయంలో కీలక నిర్ణయం పాలక వర్గం ఆమోదించింది.
సేంద్రీయ ఉత్పత్తులతోనే శ్రీవారి ప్రసాదాలు : తిరుమల శ్రీవారి నైవేద్యానికి సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులను మాత్రమే వినియోగించాలని నిర్ణయించారు. అలాగే అన్నదాన ప్రసాదంతో పాటు లడ్డు ప్రసాదానికి కూడా సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణయానికి కమిటీని ఏర్పాటు చేసినట్లు ఛైర్మన్ సుబ్బారెడ్డి వెల్లడించారు. టిటిడి అవసరాలకు గాను ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన 12 రకాల ఉత్పత్తుల కొనుగోలుకు నిర్ణయించారు. ధరల నిర్ణయంపై రైతు సాధికార సంస్థ, మార్క్ ఫెడ్ తో చర్చించేందుకు టీటీడీ బోర్డు సభ్యులు డా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సనత్ కుమార్, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తో కమిటీ ఏర్పాటు చేసారు. అలిపిరి వద్ద గల మార్కెటింగ్ గోడౌన్ వద్ద నూతన గోడౌన్ల నిర్మాణానికి రూ.18 కోట్లు మరియు కోల్డ్ స్టోరేజి నిర్మాణానికి రూ.14 కోట్లు మంజూరు చేసారు.

వార్డులు - హాస్టళ్ల నిర్మాణం కోసం : తిరుపతిలోని స్విమ్స్ పరిధిలో గల శ్రీ పద్మావతి మహిళా వైద్యకళాశాలలో టిబి, చెస్ట్, స్కిన్ ఇతర ఐసోలేషన్ వార్డులు, స్టాఫ్ క్వార్టర్స్, హాస్టళ్ల నిర్మాణ పనుల కోసం రూ.53.62 కోట్లు మంజూరు చేసినట్టు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. గుంటూరుకు చెందిన దాత శ్రీమతి ఆలపాటి తారాదేవి రూ.10 లక్షలతో వెండి కవచాన్ని శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి అందించేందుకు ఆమోదం లభించింది. తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయ ఆధునీకరణ పనులకు రూ.3.12 కోట్లతో టెండరుకు ఆమోదం తెలిపారు. టిటిడి విద్యాసంస్థల్లో రెగ్యులర్ బోధనా సిబ్బంది నియామకానికి ఆమోదించారు. ఇప్పటికే పని చేస్తున్న కాంట్రాక్ట్ బోధనా సిబ్బందిని కొనసాగిస్తూనే రెగ్యులర్ ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి పాలక వర్గం ఆమోదం తెలిపింది.

ఢిల్లీలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు : ఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మే 3 నుంచి 13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుపతిలో నిర్మాణంలో ఉన్న శ్రీనివాస సేతు పనులను త్వరితగతిన పూర్తి చేసి జూన్ 15వ తేదీ నాటికి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఒంటిమిట్టలో శ్రీరామ నవమి వేడుకలు..కళ్యాణ్ వైభవంగా నిర్వహించిన సిబ్బందిని పాలక వర్గం అభినందించింది. ఎఫ్.సి.ఆర్.ఏ (విదేశీ విరాళాల స్వీకరణ చట్టం) ప్రకారం విదేశీ భక్తుల నుండి విరాళాలు స్వీకరించడానికి టిటిడికి అనుమతి ఉందని ఛైర్మన్ స్పష్టం చేసారు. ఈ అనుమతి 2020 జనవరికి ముగిసింది. దీనిని రెన్యువల్ చేసుకోవడానికి టిటిడి దరఖాస్తు చేసిందని వెల్లడించారు. త్వరగా లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడానికి రూ.3 కోట్లు చెల్లించినట్లు స్పష్టం చేసారు. చెల్లించిన రూ.3 కోట్ల సొమ్మును తిరిగి పొందడానికి కృషి చేస్తున్నట్లు ఛైర్మన్ సుబ్బారెడ్డి వెల్లడించారు.












Click it and Unblock the Notifications