TTD: వీఐపీ బ్రేక్ దర్శనంపై టీటీడీ తాజా అప్డేట్ - ఆ రోజు సిఫారసు లేఖలకు నో..!!
Tirumala: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 11న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం టీటీడీ నిర్వహించనుంది. జూలై 17వ తేదీన ఆణివార ఆస్థానం సందర్భంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 11న బ్రేక్ దర్శనాల పైన టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ముందు రోజు సిఫారసు లేఖలు స్వీకరించరని స్పష్టం చేసింది. శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంకు ప్రత్యేకత ఉంది.
తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 17వ తేదీన సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని జూలై 11వ తేదీన మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జూలై 11న బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

ఈ కారణంగా జూలై 10న సోమవారం సిఫారసు లేఖలు స్వీకరించరని వెల్లడించింది. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం కార్యక్రమం సుమారు 5 గంటలపాటు కొనసాగనుంది. తిరుమంజనం కార్యక్రమం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు.
అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. తిరుమంజనం కారణంగా మంగళవారంనాడు నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. ఇదే సమయంలో టీటీడీ అనుబంధ ఆలయాల సమాచారం భక్తులకు అందుబాటులోకి తెచ్చేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుకున్నారు.
టీటీడీ వెబ్సైట్లో స్థానిక ఆలయాలు, అనుబంధ ఆలయాల సమాచారం అప్లోడ్ చేయడానికి చర్యలు తీసుకోవాలని జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.ఆలయాల సందర్శనకు వచ్చే భక్తుల సౌలభ్యం కోసం ఆయా ఆలయాల స్థల పురాణం, దూరం, వీటికి సంబంధించిన సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
అలాగే ఆలయాల విశిష్టతపై వివిధ బాషల్లో సంక్షిప్త సమాచారం పొందుపరచాలన్నారు. ఇందుకోసం ఐటీ, పిఆర్వో విభాగాలతో సమన్వయం చేసుకుని త్వరలో వెబ్సైట్లో ఆలయాల సమాచారం, సేవలు, దర్శన వేళలు ఆలయాల్లో భక్తులకు ఉన్న సదుపాయాలు తదితర విషయాలన్నీ పొందుపరచాలని వీరబ్రహ్మం సూచించారు. ప్రతి ఆలయంలో ఉభయ దారులను ప్రోత్సహించేలా చూడాలన్నారు.












Click it and Unblock the Notifications