శ్రీవారి టికెట్లు ముందుగా బుక్ చేసుకున్నా వారికి నిరాశే - టీటీడీ కీలక సూచన..!!
కోవిడ్ సమయంలో శ్రీవారి సేవా టికెట్లను ముందస్తుగా నమోదు చేసుకొని దర్శనం చేసుకోలేకపోయిన భక్తులకు రీ షెడ్యూల్ చేసే విషయం పైన టీటీడీ క్లారిటీ ఇచ్చింది. తిరిగి వారిని ఆ సేవలకు అనుమతించ లేమని టీటీడీ తేల్చి చెప్పింది. ఇదే సమయంలో కీలక సూచన చేసింది. ఇటు హనుమజ్జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జాపాలి తీర్థంలో ఉదయం స్వామివారికి అభిషేకం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టిటిడి అధికారులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.
టీటీడీ తాజా సూచన : కరోనా సమయంలో శ్రీవారి సేవా టికెట్లను భక్తులు ముందుగానే బుక్ చేసుకున్నారు. కానీ, అప్పడు అవకాశం వినియోగించుకోలేకపోయిన భక్తుల విషయంలో టీటీడీ ఇప్పుడు కీలక సమాచారం ఇచ్చింది. వారి కోసం రీషెడ్యూల్ చేసి సేవలకు అనుమతించలేమని టీటీడీ స్పష్టం చేసింది. వారు బ్రేక్ దర్శనానికి రావచ్చని సూచించింది. కోవిడ్ సమయంలో 2020 మార్చి 20 నుంచి 2021 ఏప్రిల్ 13 వరకు భక్తులను సేవలకు అనుమతించలేదు. స్వామి వారికి ఏకాంతంగా కైంకర్యాలు నిర్వహించారు. అదే సమయంలో శ్రీవారి సుప్రభాతం, అర్చన, తోమాల, అభిషేకం, తిరుప్పావడ, వసంతోత్సవం, విశేష పూజ, నిజపాద దర్శనం కోసం 17,946 మంది భక్తులు ముందస్తుగా పేర్లు నమోదు చేసుకున్నారు.

అవకాశం కోసం నిరీక్షణ : కోవిడ్ ముగిసిన సమయం నుంచి పరిస్థితులు అనుకూలించిన సమయంలో అవకాశం లభిస్తుందని వేచి చూస్తున్నారు. ఇప్పుడు టీటీడీ వీరి విషయంలో తమ నిర్ణయం ప్రకటించింది. బ్రేక్ దర్శనం చేసుకోవచ్చ ని..లేదా సొమ్మును వాపసు తీసుకోవచ్చని సూచించారు. ఇందులో భాగంగా సుమారు 8965 మంది బ్రేక్ దర్శనం చేసుకోగా ఇంకా 8,717 మంది వేచి చూస్తున్నారు. ఇప్పుడు టీటీడీ స్పష్టత ఇవ్వటంతో వీరంతా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక, హనుమజ్జయంతి వేడుకలను ఈ రోజు నుంచి 18వ తేదీ వరకు అంజనాద్రి ఆకాశ గంగ, జపాలి, నాదనీరాజన వేదిక, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, బేడీ ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు టిటిడి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
హనుమజ్జయంతి వేడుకలు: శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి ఉదయం, కాలినడకబాటలో ఏడవ మైలు వద్ద ఉన్న శ్రీప్రసన్న ఆంజనేయస్వామి వారికి మధ్యాహ్నం విశేషంగా అభిషేక, అర్చన, నివేదనలు నిర్వహిస్తారు. హనుమజ్జయంతి నాటికి భక్తులు హనుమదీక్షతో తిరుమల చేరుకొని జాపాలి తీర్థంలో దీక్షను విరమిస్తారు. జాపాలి తీర్థంలో స్వామివారికి అభిషేకం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టిటిడి అధికారులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. కాగా మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడవమైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహానికి ఆరోజు సాయంత్రం ప్రత్యేక పూజా కార్యక్రమాలను టిటిడి నిర్వహిస్తుంది. హనుమత్ జయంతి సందర్భంగా మఠాధిపతులు అనుగ్రహభాషణం ఇవ్వనున్నారు.












Click it and Unblock the Notifications