తిరుమలలో పెరుగుతున్న రద్దీ, శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీ నృసింహ జయంతి !
తిరుమల/తిరుపతి: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి వెలుతున్న భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వీకెండ్ రావడంతో శుక్రవారం, శనివారం, ఆదివారం భక్తుల సంఖ్య ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేసిన టీటీడీ అధికారులు అందుకు తగ్గట్లు తిరుమలలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
గురువారం రాత్రి వరకు శ్రీవారిని 64, 707 మంది దర్శించుకున్నారు. 28, 676 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. గురువారం శ్రీవారి హుండీ కానుకలు రూ. 3 కోట్ల 98 లక్షలు వచ్చాయి. శ్రీవారి సర్వదర్శనానికి 13 కంపార్ట్ మెంట్లలో వేచి చూసిన భక్తులకు స్వామి దర్శనం చేసుకోవడానికి 18 గంటల సమయం పట్టిందని టీటీడీ అధికారులు తెలిపారు.

అంతకు ముందు రెండు రోజుల పరిస్థితి ఇలా ఉంది. మంగళవారం శ్రీవారిని 75, 789 మంది దర్శించుకోగా, 27, 684 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారి హుండి కానుకలు రూ. 4 కోట్ల 35 లక్షలు వచ్చాయి. మంగళవారం శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు డైరెక్ట్ గా క్యూలైన్లలో వెళ్లారని టీటీడీ అధికారులు తెలిపారు. అయితే బుధవారం పరిస్థితులు మారిపోయాయి.
బుధవారం 68, 953 మంది శ్రీవారిని దర్శించుకోగా 30, 579 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. బుధవారం రూ. 2 కోట్ల 92 లక్షలు శ్రీవారికి హుండీ కానుకలు వచ్చాయి. శ్రీవారి సర్వదర్శనానికి వెళ్లిన భక్తులకు స్వామివారిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పట్టింది. శని, ఆదివారాల్లో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంటున్నారు.

శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీ నృసింహ జయంతి
తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం సాయంత్రం నృసింహ జయంతి జరిగింది. ప్రతి ఏటా వైశాఖ మాసంలో ఈ ఉత్సవం నిర్వహిస్తారు. శ్రీ యోగనరసింహస్వామివారి మూలమూర్తికి ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకం చేశారు. శ్రీవారి ఆలయ మొదటి ప్రాకారంలో గర్భాలయానికి ఈశాన్యం వైపున గల మండపంలో పడమరగా శ్రీ యోగ నరసింహస్వామివారి ఉప ఆలయం ఉంది.
యోగముద్రలో ఉన్న ఈ విగ్రహాన్ని శాస్త్రం ప్రకారం రూపొందించారు. స్వామివారికి నాలుగు చేతులుంటాయి. పైభాగంలో ఉన్న చేతులలో శంఖుచక్రాలు కనిపిస్తాయి. కింది రెండు చేతులు ధ్యాననిష్టను సూచిస్తాయి. క్రీ.శ 1330 నుంచి క్రీ.శ 1360 మధ్య కాలంలో నిర్మితమైన ఈ ఆలయంలో శ్రీ రామానుజాచార్యుల వారు శ్రీ యోగ నరసింహస్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడి స్వామివారు సగభాగం మానవ రూపంలోనూ, మరో సగభాగం శ్రీవారి అవతారమైన సింహం రూపంలోనూ ఉంటారు.












Click it and Unblock the Notifications