టీటీడీపై దుష్ప్రచారాలకు స్వయంగా చెక్ పెట్టిన శ్రీవారి భక్తులు
తిరుపతి: ప్రముఖ నిర్మాత, తెలుగుదేశం పార్టీ నాయకుడు అశ్వినీదత్.. ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ మూడు సంవత్సరాల కాలంలో తిరుమల సర్వ నాశనం అయిందని, తిరుపతిలో జరగని పాపమంటూ లేదని విమర్శించారు. తిరుమల, తిరుపతి ప్రతిష్ఠ దిగజారిందని ధ్వజమెత్తారు. ఇంత జరుగుతున్నా వేంకటేశ్వర స్వామి ఎందుకు చూస్తూ కూర్చున్నాడో తెలియట్లేదంటూ వ్యాఖ్యానించారు.

దుష్ప్రచారానికి చెక్..
ఈ ప్రచారానికి, వ్యాఖ్యలకు శ్రీవారి భక్తులే స్వయంగా చెక్ పెట్టారు. ఒక్క జులై నెలలో 25 నుంచి 30 లక్షల మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీపై కనకవర్షాన్ని కురిపించారు. కోట్ల రూపాయల నగదును శ్రీవారికి సమర్పించారు. తిరుమలపై ఎవరెంత దుష్ప్రచారం చేసినా.. తాము వాటిని పట్టించుకోమనే సందేశాన్ని పంపించారు.

జులైలో రూ.140 కోట్లు..
జులైలో తిరుమల తిరుపతి దేవస్థానానికి అందిన హుండీ ఆదాయమే దీనికి నిదర్శనం. హుండీ ద్వారా మాత్రమే 139.45 కోట్ల రూపాయల ఆదాయం టీటీడీకి అందింది. హుండీ ద్వారా ఈ స్థాయిలో రెవెన్యూ రావడం తిరుమల చరిత్రలో ఇదే తొలిసారి. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా కోట్ల రూపాయల మేర రాబడి సాధించింది. కోట్లాదిమంది భక్తులు శ్రీవారికి హుండీ ద్వారా సమర్పించే కానుకల విలువ కొన్ని నెలలుగా 100 కోట్ల రూపాయల మార్క్‌ను అధిగమిస్తోంది. జులైలో అది మరింత పెరిగింది.

23వ తేదీ నాటికే రూ.100 కోట్లు
కిందటి నెల 23వ తేదీ నాటికే స్వామివారి హుండీ ఆదాయం 100 కోట్ల రూపాయలను దాటేసింది. మిగిలిన రోజుల్లో మరో 40 కోట్ల రూపాయల ఆదాయం అందుతుందని అప్పట్లోనే టీటీడీ అధికారులు అంచనా వేశారు. వారి అంచనాలను తప్పలేదు. 139.45 కోట్ల రూపాయలుగా హుండీ ఆదాయం నమోదైంది. కిందటి నెల 5వ తేదీన ఒక్కరోజే 6 కోట్ల 18 లక్షల రూపాయల మేర ఆదాయం అందిన విషయం తెలిసిందే.

ప్రతినెలా వంద కోట్లు..
మార్చిలో 128 కోట్ల రూపాయలు, ఏప్రిల్‌లో 127.50 కోట్ల రూపాయలు, మేలో 130.50 కోట్ల రూపాయల హుండీ ఆదాయం రికార్డయింది. జూన్‌లో కూడా 123.76 కోట్ల రూపాయలు అందాయి. జులైలో ఈ మొత్తం మరింత పెరిగింది. హుండీ రాబడి 140 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇది సరికొత్త రికార్డును సృష్టించింది.

ఇదివరకు కరోనా కష్టాలు..
కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితుల కారణంగా రెండు సంవత్సరాల పాటు టీటీడీ కొంత మేర నిధుల కొరతను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. నెలల తరబడి శ్రీవారిని దర్శించడానికి తిరుమలకు వచ్చే భక్తుల రాకపోకలపై నిషేధం విధించడం వల్ల రోజువారీ ఆదాయం గణనీయంగా తగ్గింది. ఇప్పుడా పరిస్థితులు లేవు. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. రోజూ 75 నుంచి 80 వేల మందికి పైగా భక్తులు ఏడుకొండలవాడిని దర్శించుకుంటోన్నారు.

భక్తుల రద్దీ..
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 26 కంపార్టుమెంట్లలో భక్తులు నిండిపోయారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఆదివారం తిరుమలేశుడిని 81,287 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 34,436 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.83 కోట్ల రూపాయలు. సగటున ప్రతీరోజూ హుండీ ద్వారా మాత్రమే అయిదు కోట్ల రూపాయలకు పైగా ఆదాయం శ్రీవారికి అందుతోంది.












Click it and Unblock the Notifications