వైకుంఠ ఏకాదశి నాడు తిరుమలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ అధికారుల కీలక సూచనలు ఇవే..!
తిరుపతి: కొత్త సంవత్సరం జనవరి 1వ తేదీతో పాటు వైకుంఠ ఏకాదశి పండగ సందర్భంగా 2 నుంచి 11వ తేదీ వరకు సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేపట్టారు. ఈ ఏర్పాట్లను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. టీటీడీ అదనపు కార్యనిర్వాహణాధికారి వీరబ్రహ్మంతో ఈ సాయంత్రం ఆయన తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్, కంపార్ట్‌మెంట్లు, సర్వదర్శనం క్యూలైన్లు, తదితర ప్రాంతాల్లో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు.
కొత్త సంవత్సరం, వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు వైకుంఠం క్యూకాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు, ఇతర ప్రాంతాల్లో అన్నప్రసాదాలు, తాగునీరు, టీ, కాఫీ పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేపట్టినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. భక్తులు తిరుపతిలో ఏర్పాటు చేసిన కౌంటర్లల్లో టైమ్ స్లాట్ టోకెన్లు పొందాలని సూచించారు. టైమ్ స్లాట్ తీసుకుని వైకుంఠ ద్వార దర్శనానికి రావాలని విజ్ఞప్తి చేశారు. ఫలితంగా త్వరితగతిన శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

సామాన్య భక్తుల సౌకర్యార్థం జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు బ్రేక్ దర్శనాల కోసం వీఐపీ సిఫారసు లేఖలు స్వీకరించట్లేదని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. వీఐపీలు స్వయంగా తిరుమలకు వస్తేనే- వారికి బ్రేక్ దర్శనాలను కల్పిస్తామని, ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. కోవిడ్ మళ్లీ వ్యాప్తి చెందుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరు కూడా మాస్కులను తప్పనిసరిగా ధరించాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించాలని సూచించారు.

తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాదం కాంప్లెక్స్‌తో పాటు జనవరి 1వ తేదీ నుంచి ప్రధాన కల్యాణ కళ్యాణ కట్ట ఎదురుగా గల పీఏసీ-4లో కూడా అన్న ప్రసాద వితరణను ప్రారంభిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వైకుంఠ ఏకాదశికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా తెలియజేస్తామని అన్నారు. టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై పలువురు భక్తులతో ఆయన మాట్లాడారు. ఏర్పాట్లపై వారిని అడిగి తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications