వీడియో: అలిపిరి మెట్ల మార్గంలో శ్రీవారి భక్తులకు కనిపించిన మరో చిరుత- టీటీడీ హైఅలర్ట్
తిరుపతి: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు వెలిసిన తిరుమల శేషాచలం అడవుల్లో చిరుతలు, ఇతర వణ్య ప్రాణుల సంఖ్య భారీగా పెరిగింది. 48 గంటల వ్యవధిలో శేషాచలం అడవుల్లో అయిదు వేర్వేరు ప్రాంతాల్లో చిరుతలు కనిపించాయి. వాటిని టీటీడీ అటవీ శాఖ అధికారులు సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించారు. ఎలుగుబంట్లు, ఇతర వణ్యప్రాణుల సంచారం కూడా రెట్టింపైందనే నిర్ధారణకు వచ్చారు.
వీడియో: అలిపిరి మెట్ల మార్గంలో శ్రీవారి భక్తులకు కనిపించిన మరో చిరుత- టీటీడీ హైఅలర్ట్#TTD #Cheetah #Leapord #TirumalaNews #TirumalaTemple #Oneindiatelugu pic.twitter.com/BZpQSmwEir
— oneindiatelugu (@oneindiatelugu) August 14, 2023
అలిపిరి నుంచి గాలిగోపురం, శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, 38వ మలుపు ప్రాంతాలతో పాటు మొత్తం అయిదు చోట్ల చిరుతల సంచారాన్ని గుర్తించారు. వాటి కదలికలను పసిగట్టడానికి అలిపిరి మార్గంలో గాలి గోపురం నుంచి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు సుమారు 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు వెళ్తోన్న నెల్లూరుకు చెందిన ఆరేళ్ల బాలిక లక్షితపై చిరుత దాడి చేసి చంపిన ఉదంతం అనంతరం టీటీడీ అటవీ శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. చిరుతల సంచారంపై దృష్టి సారించారు. సీసీటీవీ కెమెరాల ద్వారా వాటి కదలికపై నిఘా ఉంచారు.
లక్షితపై దాడి చేసిన చిరుతను అర్ధరాత్రి దాటిన తరువాత బంధించారు. అది సంచరించే ప్రదేశంలో ఏర్పాటు చేసిన బోనులో చిక్కిందా చిరుత. అనంతరం దీన్నీ ఎస్వీ జూపార్కునకు తరలించారు. చిరుతల సంచారం తీవ్రతరమైన నేపథ్యంలో- టీటీడీ అధికారులు అప్రమత్తం అయ్యారు. హైఅలర్ట్‌ను ప్రకటించారు.
లక్షితను బలి తీసుకున్న చిరుత బోనులో చిక్కిన కొన్ని గంటలకే మరో చిరుత హల్‌చల్ చేసింది. అలిపిరి మెట్ల మార్గం మీదుగా కాలి నడకన తిరుమలకు బయలుదేరి వెళ్లిన భక్తులకు ఇది కనిపించింది. దీనితో ఒక్కసారిగా వారు భయాందోళనలకు గురి అయ్యారు. గట్టిగా కేకలు వేయడంతో ఆ చిరుత సమీప అటవీప్రాంతంలోకి వెళ్లిపోయింది.

సమాచారం తెలుసుకున్న వెంటనే టీటీడీ అటవీ విభాగం అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. భక్తులకు ధైర్యం చెప్పారు. అందరూ గుంపులు, గుంపులుగా వెళ్లాలని సూచించారు. భద్రత సిబ్బంది అండగా ఉంటారని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చిరుతల సంచారాన్ని కట్టడి చేయడానికి చర్యలు తీసుకుంటోన్నామని వివరించారు.












Click it and Unblock the Notifications