ఊహించని షాక్ : 'సంతానం కలిగిస్తానని.. స్నానం చేసి రమ్మన్నాడు..'
విజయవాడ : అమాయక జనం మూఢ విశ్వాసాలను ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచేసుకుంటున్నారు నకిలీ బాబాలు. అవసరాల కోసం మితిమీరిన విశ్వాసాలను ఒంటబట్టించుకుని నకీలీ స్వాముల లీలల ముందు బోల్తా పడుతున్నారు చాలామంది.
తాజాగా విజయవాడలో చోటు చేసుకున్న ఓ ఘటన ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. సంతాన భాగ్యం కలిగిస్తానంటూ ఓ ఇంట్లో దూరిన నకిలీ స్వామి ఆ ఇల్లాలి బంగారు ఆభరణాలన్ని మూట గట్టుకుని ఉడాయించాడు.

వివరాల్లోకి వెళ్తే.. పెళ్ళయి చాలా కాలమవుతున్నా..సంతానం కలగట్లేదా.. దానికో మార్గం చెప్పడానికి నేనున్నాగా అంటూ విజయవాడలోని ఓ ఇంట్లో ప్రవేశించాడు ఓ నకిలీ బాబా. ఆ తర్వాత ఒంటిపై ఉన్న ఆభరణాలన్నింటిని పూజలో పెట్టి ఆమెను స్నానం చేసొచ్చి పూజలో కూర్చోవాలని చెప్పాడు.
దీంతో సదరు నకిలీ స్వామి చెప్పింది చెప్పినట్టు చేసిన ఆ ఇల్లాలు స్నానం చేసి తిరిగొచ్చేసరికి సదరు స్వామి నగలతో ఉడాయించడంతో లబో దిబోమనడం తన వంతయింది.
సద్గురు శ్రీ కోటప్ప స్వామి దైవజ్ఞ పేరిట విజిటింగ్ కార్డులను ఏర్పరుచుకున్న సదరు నకిలీ స్వామిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో భాగంగా అతను ప్రకాశ్ నగర్‌కు చెందిన బత్తుల కోటేశ్వరరావు అని తేలింది. ప్రత్యేకించి ఏ పనంటూ చేయని ఈ స్వామి తాయత్తులు కడుతూ, సద్గురు శ్రీ కోటప్ప స్వామి దైవజ్ఞ అవతారం ఎత్తాడు.
పెళ్లి, పిల్లలు, సంతానం, ఉద్యోగం వ్యాపార సమస్యలతో ఇబ్బందిపడేవారిని తన మాయ మాటలతో బురిడీ కొట్టించడంలో ఇతగాడు ధిట్ట. పూజల పేరిట ఇళ్లలో బంగారు నగలను కొట్టేస్తూ.. చివరికి పోలీసులకు పట్టుబడ్డాడు.












Click it and Unblock the Notifications