చంద్రబాబుకు వార్నింగ్ లెటర్: ఆయనను చేర్చుకుంటే మేం మూకుమ్మడి రాజీనామాలు చేస్తాం
మహాసేన రాజేష్ ఈ నెల 16వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఆయన చేరికను టీడీపీకే చెందిన దళిత నాయకులు గట్టిగా వ్యతిరేకిస్తోన్నారు. ఈ మేరకు టీడీపీ దళిత ఐక్యవేదిక తరఫున చంద్రబాబుకు లేఖ రాశారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. కొద్దిరోజుల బ్రేక్ తరువాత ఆయన మళ్లీ ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని పునరుద్ధరించనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 15, 16, 17 తేదీల్లో ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్లనున్నారు. ఆయన పర్యటనను విజయవంతం చేయడానికి ఆయా జిల్లాల టీడీపీ నాయకులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు.

16న చేరికకు..
ఈ పర్యటన సందర్భంగా మహాసేన రాజేష్.. తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఈ నెల 16వ తేదీన చేరికకు ముహూర్తం పెట్టుకున్నారు. చంద్రబాబు చేతుల మీదుగా ఆయన టీడీపీ కండువాను కప్పుకోనున్నారు. నిజానికి- ఆయన తొలుత జనసేనలో చేరొచ్చనే ప్రచారం విస్తృతంగా సాగింది. దీనికి ముహూర్తం కూడా ఖరారైందనే వార్తలు వచ్చాయి. మహాసేన రాజేష్ ఈ విషయాన్ని ధృవీకరించారు కూడా. జనసేనలో చేరుతారంటూ జరిగిన ప్రచారాన్ని సమర్థించారు. ఆ తరువాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. తాజాగా టీడీపీలో చేరబోతోన్నారు.

టీడీపీలో కలకలం..
కాగా- చంద్రబాబు సమక్షంలో మహాసేన రాజేష్ తెలుగుదేశం పార్టీలో చేరబోతోన్నారనే వార్తలు కలకలం రేపుతోన్నాయి. టీడీపీలోని దళిత నాయకులు ఆయన చేరికను గట్టిగా వ్యతిరేకిస్తోన్నట్టే కనిపిస్తోంది. ఆయనను పార్టీలో చేర్చుకుంటే జరగబోయే పరిణామాల గురించి వారు చంద్రబాబుకు సైతం హెచ్చరించారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ దళిత ఐక్య వేదిక పేరు మీద ఓ లేఖ విడుదల చేశారు. ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మూకుమ్మడి రాజీనామా..
తాను టీడీపీలో చేరబోతోన్నట్లు మహాసేన రాజేష్ ఇటీవలే ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా తెలియజేశారని, అదే గనక జరిగితే పార్టీలో కొనసాగుతూ వస్తోన్న దళిత నాయకులందరూ మూకుమ్మడి రాజీనామాలు చేస్తారని ఈ లేఖలో పొందుపరిచారు. ఈ రాజీనామా లేఖలను అంగీకరించాల్సి ఉంటుందని చంద్రబాబుకు సూచించారు.

చంద్రబాబు, లోకేష్ పై..
గతంలో చంద్రబాబు, నారా లోకేష్ పై మహాసేన రాజేష్ అనేక ఆరోపణలు చేశారని, చాలామంది దళితులను తమ పార్టీకి దూరం చేశారని టీడీపీ దళిత ఐక్యవేదిక నాయకులు గుర్తు చేశారు. వైసీపీలో కొద్దిరోజులు పని చేశారని చెప్పారు. జనసేనలో చేరాలనుకుని చివరికి టీడీపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. ఆయన ఏదో ఆశించే టీడీపీలో వస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఇన్ని సంవత్సరాలుగా తాము ఏమీ ఆశించకుండా టీడీపీలో పనిచేస్తోన్నామని చెప్పారు.

తన ఖాతాలో..
ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే.. దాన్ని మహాసేన రాజేష్ తన ఖాతాలో వేసుకుంటాడని దళిత ఐక్యవేదిక నాయకులు స్పష్టం చేశారు. అలాంటి వారిని చేర్చుకుని పార్టీ విలువలను దిగజార్చొద్దని వారు చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. తమ విజ్ఞప్తిని కాదని, మహాసేన రాజేష్ ను పార్టీలో చేర్చుకుంటే నిస్సంకోచంగా తాము రాజీనామా చేస్తామని హెచ్చరించారు. టీడీపీ అంటే కొన్ని విలువలు, విశ్వసనీయత కలిగిన పార్టీ కావడం వల్ల తమ సలహాలను పాటిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications