గంటకో కులం అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ - జనసేనానికి మంత్రుల సవాల్..!!
జనసేనానిపై మంత్రులు ఫైర్ అయ్యారు. గంటకో కులం అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రులు ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ ది సెలబ్రెటీ పార్టీ అని మంత్రి బొత్సా వ్యాఖ్యానించారు. గంటకో కులం అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. మరో మంత్రి జోగి రమేష్ పవన్ కు సవాల్ చేసారు. సామాజిక న్యాయంపై చర్చకు సిద్దమా అంటూ ప్రశ్నించారు. మాజీ మంత్రి వెల్లంపల్లి ఏ కులమో చెప్పుకోలేని వ్యక్తి పవన్ కల్యాణ్ అంటూ వ్యాఖ్యానించారు. బీసీల గురించి మాట్లాడే అర్హత పవన్ కు లేదని వైసీపీ మంత్రులు ఫైర్ అయ్యారు.

సామాజిక న్యాయంపై చర్చకు సిద్దమా
జనసేన బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపైన మంత్రులు కౌంటర్ ఇచ్చారు. బీసీలకు పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. పార్టీ పెట్టిన పదేళ్లకు పవన్ కు బీసీలు గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు మద్దతిచ్చిన పవన్ నాడు బీసీలకు ఇచ్చిన 125 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ఏపీలో జరుగుతున్న సామాజిక న్యాయం చూసి పవన్ ఓర్వేలకపోతున్నారని మండిపడ్డారు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని చెప్పలేని వాళ్లు బీసీలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. వీరంతా కలిసి కట్టుగా వచ్చినా సీఎం జగన్ ను ఏమీ చేయలేరని మంత్రి జోగి రమేష్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు కు పవన్ ఒక బానిసగా పేర్కొన్నారు.

కాపు కులంలో పుట్టి రాజకీయంగా ఎదిగా
సీనియర్ మంత్రి బొత్సా జనసేనాని పైన ఫైర్ అయ్యారు. మూడ్ వచ్చినప్పుడు మాట్లాడే నాయకుడు పవన్ కళ్యాణ్ అని విమర్శించారు. పవన్ వైఖరి చూస్తుంటే జాలేస్తోందని వ్యాఖ్యానించారు. నిర్దిష్టమైన లక్ష్యం ఉంటే నీతి., నిజాయితీ తో పోరాడాలని సూచించారు. రాజకీయాల్లోకి వచ్చి టాటా.. బిర్లాల మాదిరిగా ఎక్కడ ఎదిగిపోయానో పవన్ కళ్యాణ్ చెప్పగలరా అని బొత్సా ప్రశ్నించారు. బలహీన వర్గాలకు భ్రాండ్ అంబాసిడర్ లాంటి పార్టీ వైసీపీ అని బొత్సా పేర్కొన్నారు. పక్క రాష్ట్రంలో బీసీలకు జరుతున్న అన్యాయంపై పవన్ ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదుని బొత్సా నిలదీసారు. తన కంటే ముందు తూర్పు కాపు కులంలో చాలా మంది మంత్రులు చేశారని గుర్తు చేసారు. తాను వ్యక్తిగతంగా ఎంత అభివృద్ధి చెందానో పవన్ కళ్యాణ్ చెప్పాలని బొత్సా డిమాండ్ చేసారు.

ఏ కులమో చెప్పుకోలేని స్థితిలో
తాను కాపు కులంలో పుట్టి రాజకీయంగా ఎదిగానని ధైర్యంగా చెప్పుకుంటానని బొత్సా చెప్పుకొచ్చారు. టీడీపీతో భాగస్వామిగా ఉన్నప్ఫడు బీసీలకు జరిగిన అన్యాయం పవన్ కళ్యాణ్ కు గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీవివాస్ పవన్ వ్యాఖ్యల పైన మండిపడ్డారు. ఏ కులమో చెప్పుకోలేని వ్యక్తి పవన్ అని ఘాటు వ్యాఖ్యలు చేసారు. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన పదేళ్లల్లో ఒక్క సర్పంచ్ ను కూడా గెలిపించుకోలేకపోయారని ఎద్దేవా చేసారు. జనసేన చంద్రబాబుకు భజన చేసే పార్టీ అని వ్యాఖ్యానించారు. 175 సీట్లలో పోటీ చేసే దమ్ముందా అని వెల్లంపల్లి నిలదీసారు.












Click it and Unblock the Notifications