చంద్రబాబు తొలి హయాంలో బుడమేరు అభివృద్ధికి భారీగా కేంద్రం నిధులు.. బయటపెట్టిన బీజేపీ
Purandeswari: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో వరుసగా కుంభవృష్టి తరహా పరిస్థితులు సంభవించాయి. మొన్నటివరకు భారీ వర్షాలు దంచికొట్టాయి. కోస్తా తీర ప్రాంత జిల్లాలను ముంచివేశాయి. ప్రత్యేకించి- రాజధాని అమరావతి సహా ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల కృష్ణానది ఉగ్రరూపాన్ని ధరించింది. వరద నీటితో పోటెత్తింది. కొన్ని రోజులపాటు బుడమేరుకు వరద ప్రవాహం కొనసాగింది. ప్రస్తుతం దీని తీవ్రత భారీగా తగ్గింది. విజయవాడ, అమరావతి ప్రాంతాలు కోలుకున్నాయి. సింగ్‌నగర్, చిట్టినగర్, సితార, రాజరాజేశ్వరి పేట, యనమలకుదురు, జక్కంపూడి వంటి ప్రాంతాల్లో వరదనీరు పూర్తిగా తగ్గింది.

అదే సమయంలో సహాయక, పునరావాస చర్యలు ముమ్మరం సాగుతున్నాయి ఆయా ప్రాంతాల్లో. అధికార యంత్రాంగం అక్కడే మకాం వేసింది. చిట్టచివరి వ్యక్తి వరకూ సహయక చర్యలు అందేలా చేస్తోంది. అధికార తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమవంతు సహాయక చర్యలను అందిస్తోన్నారు.
విజయవాడ మునిగిపోవడానికి ప్రధాన కారణం- బుడమేరు. వరద ప్రవాహాన్ని ఇందులోకి మళ్లించడం వల్లే విజయవాడ ఈ దుస్థితికి చేరిందనే అభిప్రాయాలు ఉన్నాయి. బుడమేరుకు భారీగా గండ్లు పడటం, వరద ప్రవాహం మొత్తం జనావాసాల్లోకి ప్రవహించడానికి కారణం అయింది.
ఈ గండ్లను యుద్ధ ప్రాతిపదికన పూడ్చివేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఒకవంక వరద ప్రవాహం కొనసాగుతున్నప్పటికీ లెక్క చేయకుండా ఆరు రోజుల వ్యవధిలో మూడు గండ్లనూ పూర్తిగా పూడ్చివేసింది. జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి గండ్ల పూడ్చివేత పనులను పర్యవేక్షించారు. దీనికోసం అర్ధరాత్రి వేళా ఆయన ఆయా ప్రాంతాల్లో పర్యటించారు.
గండ్ల పూడ్చివేతను తన ఖాతాలో వేసుకుంది భారతీయ జనతా పార్టీ. తమ ప్రభుత్వం వల్లే ఆపరేషన్ బుడమేరు విజయవంతమైందని పేర్కొంది. బుడమేరు గండ్లను ఎన్డీఏ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూడ్చివేసిందని తెలిపింది. విజయవాడ ప్రజలను వరద నుంచి రక్షించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో కృషి చేశాయని వ్యాఖ్యానించింది.
విజయవాడ వరదలకు మూల కారణం గత @YSRCParty ప్రభుత్వం. మాజీ సీఎం @ysjagan గారు తప్పిదాలను సరిచేస్తూ, ఆంధ్ర ప్రజల సంక్షేమానికి పాటు పడుతున్న ఎన్డీయే ప్రభుత్వం" - శ్రీమతి @PurandeswariBJP గారు, మెంబర్ అఫ్ పార్లమెంట్ మరియు ఆంధ్ర ప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు#VijayawadaFloods… pic.twitter.com/Bs37qCkwu8
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) September 9, 2024
విజయవాడలో సంభవించిన వరదలు.. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనన ఏపీ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి విమర్శించారు. బుడమేరు ఉప్పొంగకుండా తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, గండ్లు పడకుండా గట్లను బలోపేతం చేయడానికి 2014- 2019లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కేంద్రం రాష్ట్రానికి 400 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని అన్నారు.
ఆ తరువాత వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం.. ఆ నిధులను సక్రమంగా వినియోగించడంలో విఫలమైందని పురందేశ్వరి విమర్శించారు. వాటి ఫలితంగా ఇప్పుడు బుడమేరుకు గండ్లు పడ్డాయని ఆరోపించారు. బుడమేరును బలోపేతం చేయడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం విశేష సహకారాన్ని అందించిందని అన్నారు.












Click it and Unblock the Notifications