బీసీ ఓటు బ్యాంకు కోసం వైసీపీ కొత్త నినాదం..!!
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టినట్టే కనిపిస్తోంది. జిల్లాల పర్యటనలతో తీరిక లేకుండ గడుపుతోన్నారాయన. వరుసగా బహిరంగ సభలను నిర్వహిస్తోన్నారు. ప్రజల సమక్షంలోనే సంక్షేమ పథకాల నిధులను విడుదల చేస్తోన్నారు. అమలులో ఉన్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూనే- ప్రతిపక్షాలపై ఘాటు విమర్శలను సంధిస్తోన్నారు.

బీసీ నేతలతో..
పార్టీకి వెన్నుదన్నుగా ఉంటోన్న వెనుకబడిన సామాజిక వర్గంపై వైఎస్ జగన్ దృష్టి సారించారు. బీసీలకు మరింత ప్రాధాన్యత ఇవ్వడానికి వెనుకాడట్లేదు. వారి కోసం ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను ప్రకటించే అవకాశాలను వైఎస్ జగన్ పరిశీలిస్తోన్నారు. బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్యాస్ట్ కాదని, బ్యాక్ బోన్ క్యాస్ట్ అని భావిస్తోన్నారు వైఎస్ జగన్. 2019 ఎన్నికల్లో బీసీలందరూ గంపగుత్తగా ఓటు వేయడం వల్లే 151 అసెంబ్లీ స్థానాలను వైసీపీ గెలుచుకుందనేది బహిరంగ రహస్యమే.

మరింత బలోపేతం..
2024 నాటికి కూడా ఇదే ఓటు బ్యాంకును మరింత బలోపేతం చేసుకోవడంపై వైసీపీ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఇదివరకెప్పుడూ లేని విధంగా సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఆ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. బీసీల కోసం ప్రత్యేకంగా ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించడానికి సమాయాత్తమౌతోంది.

7వ తేదీ నాడే..
ఇందులో భాగంగా ఈ నెల 7వ తేదీన విజయవాడలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతోంది. తొలుత 8వ తేదీన బీసీ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించాలని భావించింది. దీన్ని ఇంకో రోజు ముందుకు జరిపింది. 7వ తేదీకి ఖాయం చేసింది. ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో ఈ సభను ఏర్పాటు చేసింది. దీనికి జయహో బీసీగా నామకరణం చేసింది వైసీపీ అగ్రనాయకత్వం. జయహో బీసీ నినాదంతోనే ముందుకెళ్లనుంది అధికార పార్టీ.

ప్రజా ప్రతినిధులకు ఆహ్వానం..
ఈ జయహో బీసీ మహాసభకు రాష్ట్రంలోని బీసీ సర్చంచులు, జడ్పీటీసీలు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్లు, డైరెక్టర్లు, ఆలయ కమిటీ ప్రతినిధులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు.. దీనికి హాజరవుతారు. వైెస్ జగన్ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా బీసీల కోసం కొన్ని నజరానాలను ప్రకటించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

సాయిరెడ్డి అధ్యక్షతన..
ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇటీవలే పార్టీకి చెందిన సీనియర్ బీసీ నాయకులు ఈ సభ ఏర్పాటు గురించి చర్చించిన విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి దీనికి అధ్యక్షత వహించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, జోగి రమేష్, గుమ్మనూరు జయరాం, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, శాసన మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, కొలసు పార్థసారథి, మాజీ మంత్రి పీ అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు.












Click it and Unblock the Notifications