ప్రచారానికే..? వరద పర్యటన పేరుతో రాజకీయం, చంద్రబాబుపై సజ్జల విసుర్లు
తెలుగు రాష్ట్రాల్లో వర్షంతో వరదలు కొనసాగుతున్నాయి. జనం ఇబ్బందులు పడుతున్నారు. అన్నదాత కూడా పనులు సాగడం లేదు. ఏపీలో ప్రతిపక్ష నేత ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. జనంతో మమేకం కాగా.. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీనిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. కోనసీమ జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటనపై శుక్రవారం మీడియాతో మాట్లాడారు. వరద బాధితులకు ఎలాంటి సహాయం అందలేదని నిరూపించడమే పర్యటన వెనుక ఉద్దేశం అని ఆరోపించారు.

ఎవరూ చెప్పడం లేదే..?
తమకు సాయం అందలేదని ఏ ఒక్కరూ చెప్పలేదని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. దీంతో చంద్రబాబు చెప్పేది అబద్ధమని తేలిపోయిందని అన్నారు. బాబు అబద్దాలు వల్లెవేస్తున్నారని జనానికి కూడా అర్థమయ్యిందని వివరించారు. పరామర్శ కంటే ప్రచారానికే చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారని సజ్జల విమర్శించారు. ఇదీ మంచి పద్దతి కాదన్నారు. జనం కష్టంలో ఉంటే సాయం చేయాల్సింది పోయి.. విమర్శలు చేయడానికి సమయం కేటాయించడం బాగోలేదన్నారు.

ప్రచారానికా..?
చంద్రబాబు వెళ్లింది దేనికి? వరద పర్యటనకా? ప్రచారానికా? అని సజ్జల ప్రశ్నించారు. పచ్చి అబద్ధాలను చెప్పారని ఆయన విమర్శించారు. చంద్రబాబు నాయుడు జీవితమే ఓ అబద్ధం అయిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆనాడు టీడీపీ హయాంలో విపత్తులు వస్తే ఒక్కసారైనా తక్షణ సాయంగా పైసా ఇచ్చారా? అడిగారు. చీపురు పట్టుకుని ఫొటోలకు పోజులివ్వడం తప్ప ఏమీ చేయలేదని మండిపడ్డారు.

మీడియాలో కనిపించాలనే యావ తప్ప
మీడియాలో కనిపించాలనే యావ చంద్రబాబును ఇలా చేసిందని కామెంట్ చేశారు. అధికారంలో ఉండగా అలా ప్రవర్తించారని.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తీరు మారలేదని చెప్పారు. ఆయన చేసే అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదని విమర్శలు చేశారు. తన ఉనికిని చాటుకునే ప్రయత్నంలో భాగంగానే ఇలా కామెంట్స్ చేస్తున్నారని గుర్తుచేశారు. అయినప్పటికీ తమ ప్రభుత్వంపై జనాలకు విశ్వాసం ఉందని వివరించారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం చేస్తోన్న పనులను జనం గుర్తిస్తున్నారని వివరించారు.












Click it and Unblock the Notifications