నేడు ఘనంగా బెజవాడ దుర్గమ్మకు తెలంగాణా బంగారు బోనం!!
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గాదేవి శాకంబరీ ఉత్సవాలు నిన్నటి నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో తొలి రోజు అమ్మవారిని అన్ని రకాల కూరగాయలతో, పండ్లతో అలంకరించారు. పాడిపంటలతో అందరూ సుభిక్షంగా ఉండేందుకు ప్రతి సంవత్సరం దుర్గమ్మ ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే నేడు బెజవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం సమర్పించనున్నారు. హైదరాబాద్ మహంకాళి బోనాల సందర్భంగా బెజవాడ దుర్గమ్మకు ప్రతి సంవత్సరం తెలంగాణ బంగారు బోనం సమర్పించటం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం కూడా హైదరాబాదులోని ఉమ్మడి దేవాలయాల మహంకాళి జాతర బోనాల కమిటీ ఆధ్వర్యంలో బెజవాడ దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించనున్నారు.

దీనికోసం దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం లో ఇప్పటికే ఆలయ అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహించే ఈ బోనాల సమర్పణకు కొద్ది రోజుల క్రితమే కమిటీ నగరానికి వచ్చి దుర్గగుడి ట్రస్టు బోర్డు చైర్మన్ కు, కార్యనిర్వహణ అధికారికి సమాచారం అందించింది. సుమారు వెయ్యి మంది వరకు హైదరాబాద్ నుంచి దుర్గమ్మకు బోనాలను సమర్పించడానికి వచ్చే అవకాశం ఉంది.
నేడు బోనాల సమర్పణ లో భాగంగా బ్రాహ్మణ వీధి లోని జమ్మి దొడ్డి వద్ద పూజలు నిర్వహించి ఆపై ఊరేగింపుగా కొండపైకి చేరుకుంటారు. అట్టహాసంగా పోతురాజుల ఊరేగింపుతో, వారు చేసే విన్యాసాలతో, భూత, భేతాళ వేషాలతో బోనాలను సమర్పించడానికి వెళతారు. బోనాలు అత్యంత భక్తిభావంతో అమ్మవారికి నివేదిస్తారు. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు కొండపైకి వెళ్లే వారు చేసే నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు సకాలంలో కురవాలని, పాడిపంటలతో రైతులందరూ, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ గత 14 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించడం జరుగుతుంది. అత్యంత భక్తి భావంతో నేడు తెలంగాణా ప్రజలు దుర్గమ్మకు బంగారు బోనం సమర్పిస్తారు.












Click it and Unblock the Notifications