రేపు నారా లోకేష్ తో వంగవీటి రాధా భేటీ ? పీలేరు పాదయాత్రలో-జనసేనలో చేరిక వార్తల నేపథ్యంలో..
టీడీపీని వీడి జనసేనలో చేరబోతున్నారనే వార్తల నేపథ్యంలో విజయవాడ నేత వంగవీటి రాధా రేపు నారా లోకేష్ తో భేటీ కాబోతున్నారు.
ఏపీ రాజకీయాల్లో నిత్యం వార్తల్లో ఉంటున్న విజయవాడ నేత వంగవీటి రాధా తాజాగా మరోసారి కలకలం రేపుతున్నారు. గత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన రాధా.. ఆ పార్టీ తరపున పోటీ చేయకుండా ప్రచారానికే పరిమితం అయ్యారు. ఈసారి మాత్రం టీడీపీని వీడి జనసేనలో చేరడం ద్వారా బందరు నుంచి పోటీకి సిద్దమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లీకులు కూడా జనసేన నేతల నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం ఆయనతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
వంగవీటి రాధా టీడీపీని వీడి జనసేనలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఆయన రేపు పార్టీ యువనేత నారా లోకేష్ ను కలవబోతున్నారు. ఈ మేరకు లోకేష్ నుంచి రాధాకు పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పీలేరులో పాదయాత్రలో ఉన్న లోకేష్ .. రాధాను తనను వచ్చి కలవాలని కోరినట్లు సమాచారం. దీంతో రాధా రేపు ఆయన్ను కలిసేందుకు బయలుదేరి వెళ్తున్నట్లు తెలుస్తోంది.

రేపు యువగళం పాదయాత్ర విడిది ప్రాంతంలో లోకేష్, రాధా ఇద్దరు సమావేశం కానున్నారు. భేటీ అనంతరం నారా లోకేశ్‌తో కలిసి పాదయాత్రలో రాధ పాల్గొనే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.లోకేశ్‌తో రాధ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లభిస్తోంది. రాజకీయ అంశాలపై వీరిద్దరూ సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది.గత కొంతకాలంగా పలువురు నేతలతో విస్తృత చర్చలు జరిపిన వంగవీటి రాధా, వివిధ రాజకీయ అంశాలు, ఇతర నేతల చర్చల్లో వచ్చిన అంశాలపై లోకేశ్‌తో చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. మరోవైపు జనసేనలో చేరికపై ఊహాగానాలు కూడా వస్తున్న తరుణంలో లోకేశ్, రాధా భేటీలో చర్చించే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications