కృష్ణా రాజకీయంలో కేశినేని నాని 'సూపర్ ట్విస్ట్?'
నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీపై, పార్టీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని తన స్వరాన్ని మారుస్తున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో చంద్రబాబుకు బొకే ఇవ్వడానికే నిరాకరించిన నాని ఇప్పుడు చంద్రబాబునాయుడు అధికారంలోకి రావాలని మాట్లాడుతున్నారు. సొంత పార్టీలోనే అసమ్మతి నేతగా ఎంపీ కేశినేని నాని పేరుపొందిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన పార్టీపై, చంద్రబాబుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు రావాలి..
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని కేశినేని నాని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే అది సాధ్యమవుతుందని, దానికోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారని చెప్పారు. గన్నవరం ఘటనలో జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చిన కృష్ణా జిల్లా తోట్లవల్లూరుకు చెందిన వీరంకి వెంకట గురుమూర్తిని, ఆయన కుటుంబ సభ్యులను కేశినేని నాని పరామర్శించారు.
ఏపీలో ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ రాష్ట్ర ప్రభత్వ తీరుపై మండిపడ్డారు. ఎవరికీ హాని కలిగించని గురుమూర్తిపై అక్రమ కేసులు బనాయించడం అన్యాయం, దారుణమన్నారు.

బీసీ నాయకుడిపై కేసు పెట్టడం దారుణం
సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో బీసీ నాయకుడైన గురుమూర్తి ప్రజలకు దగ్గరయ్యారని, అటువంటి నాయకుడిపై అక్రమకేసులు పెట్టి జైలుకు పంపించడం దుర్మార్గమన్నారు. 1970లో ఏపీలో ఎటువంటి పరిస్థితులున్నాయో అంతకంటే అధ్వాన్నంగా ప్రస్తుత పరిస్థితులున్నాయని, రాష్ట్రంలో అభివృద్ధి జాడే లేదని, ఏపీ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు వల్లే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారన్నారు.
ఏపీకన్నా బీహార్ అన్నిరంగాల్లో ముందుందన్నారు. రాష్ట్రంలో అధ్వాన్నంగా తయారైన రోడ్లపై గుంతలు పూడ్చలేనివారు మూడు రాజధానులు నిర్మిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

పార్టీలో చురుగ్గా నాని
కొద్దిరోజులుగా పార్టీలో యాక్టివ్ గా లేకుండా తిరిగి పోటీచేస్తారో? లేదో? అనే విషయంలో స్పష్టత ఇవ్వకుండా కొనసాగుతున్న నాని తాజాగా ఒక స్పష్టత ఇచ్చినట్లైంది. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడంద్వారా ఎంపీ కేశినేని నాని తిరిగి వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి నానిని చంద్రబాబు ఇన్ ఛార్జిగా నియమించారు. వచ్చే ఎన్నికల్లో నాని పోటీచేస్తారా? లేదంటే కుమార్తె శ్వేతను రంగంలోకి దింపుతారా? అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. విజయవాడ పశ్చిమ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయడానికి నాని ఆసక్తి చూపిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తోపాటు నాగుల్ మీరా, బుద్ధా వెంకన్న కూడా ఈ సీటు కోసం పోటీపడుతున్నారు. అయితే అధినేత చంద్రబాబు మనసులో ఏముందో ఇంకా క్లారిటీ రాలేదు.

విభేదాలకు ముగింపు ఎప్పుడు?
మరోవైపు నాని సోదరుడు కేశినేని చిన్ని కూడా టీడీపీలో దూకుడు పెంచారు. ఇప్పటికే సేవా కార్యక్రమాలను చేపట్టడంతోపాటు పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. కేశినేని నాని, కేశినేని చిన్ని వారి వారి పనులు చేసుకుంటూ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారని, గ్రూపు రాజకీయాలతో సతమతమవుతున్న ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీలోని నేతల మధ్య విభేదాలున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయానికి ఈ విభేదాలకు ముగింపు పలికేలా చంద్రబాబు వ్యవహరిస్తారని తెలుగు తమ్ముళ్లు ఆశతో ఉన్నారు.












Click it and Unblock the Notifications