ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ఇంటికి వెళ్లిన వైఎస్ విజయమ్మ, అలీ
శాసనమండలి సభ్యుడు, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ను పార్టీ మాజీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పరామర్శించారు. ఇటీవలే ఆయన భార్య స్వర్ణకుమారి కన్నుమూసిన విషయం తెలిసిందే.
విజయవాడ: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసన మండలి సభ్యుడు, ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ ను ఇవ్వాళ పలువురు ప్రముఖులు పరామర్శించారు. వైఎస్ఆర్సీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా విభాగం సలహాదారు, ప్రముఖ నటుడు అలీ తదితరులు ఆయనను పరామర్శించిన వారిలో ఉన్నారు.
ఇటీవలే తలశిల రఘురామ్ భార్య స్వర్ణ కుమారి ఈ నెల 5వ తేదీన కన్నుమూసిన విషయం తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అదేరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య వైఎస్ భారతి.. గొల్లపూడిలోని తలశిల రఘురాం నివాసానికి వెళ్లి.. స్వర్ణకుమారి భౌతిక కాయానికి నివాళి అర్పించారు.

ఇవ్వాళ వైఎస్ విజయమ్మ, అలీ తదితరులు వేర్వేరుగా తలశిల రఘురామ్ ను పరామర్శించారు. ఈ మధ్యాహ్నం అలీ తలశిల రఘురాం నివాసానికి వెళ్లారు. స్వర్ణకుమారి చిత్రపటానికి నివాళి అర్పించారు. కొద్దిసేపు తలశిలతో మాట్లాడారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఈ సాయంత్రం వైఎస్ విజయమ్మ హైదరాబాద్ నుంచి గొల్లపూడికి చేరుకున్నారామె. వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు ఆమెను రిసీవ్ చేసుకున్నారు. అనంతరం తలశిల రఘురాం ఇంటికి వెళ్లారు. స్వర్ణకుమారి చిత్రపటానికి నివాళి అర్పించారు. తలశిల, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. వైఎస్ జగన్ ఆప్తమిత్రుడిగా, నమ్మకస్తుడిగా తలశిల రఘురామ్ కు పేరుంది.
ఆవిర్భావం నుంచీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పని చేస్తోన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. 1996 నుంచి 2002 వరకు కృష్ణా జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీలో చేరారు.
ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయకర్తగా వ్యవహరిస్తోన్నారు. తలశిల రఘురాంకు 2021లో జరిగిన ఏపీ శాసనమండలి ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే కోటాలో టికెట్ కేటాయించారు వైఎస్ జగన్. ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.












Click it and Unblock the Notifications