Virat Kohli vs Naveen-ul-Haq : గ్రౌండ్ లో ముగిసినా- సోషల్ మీడియాలో సాగుతున్న వార్...
ఈసారి ఐపీఎల్ సీజన్ లో పెద్దగా వివాదాల్లేవని భావిస్తున్న తరుణంలో నిన్న ఆర్సీబీ, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల ఆటగాళ్ల మధ్య చోటు చేసుకున్న మాటల యుద్ధం తీవ్ర చర్చనీయాంశమైంది. ఓ దశలో ఇరుజట్ల ఆటగాళ్లు కొట్టుకునే పరిస్ధితి కూడా కనిపించింది. దీంతో వారి సహచరులు సకాలంలో జోక్యం చేసుకుని దాన్ని ఆపారు. కానీ అప్పటికప్పుడు శాంతించినట్లు కనిపించినా ఆ తర్వాత సోషల్ మీడియాలో తిరిగి మొదలైంది.
నిన్న లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన ఐపీఎల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు కేవలం 126 పరుగులు మాత్రమే చేయగా..లక్నో దాన్ని ఛేదించడానికి అష్టకష్టాలు పడింది. చివరకు బెంగళూరు అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో 108 పరుగులకే లక్నోను కట్టడి చేసేసింది. రెండో ఇన్నింగ్స్ 17వ ఓవర్లో బ్యాటింగ్ చేస్తున్న నవీనుల్ హక్ కూ, ఆర్సీబీ ఆటగాడు కొహ్లీకి మధ్య చిన్నగా మాటల యుద్ధం మొదలైంది.

ఆ తర్వాత మ్యాచ్ లో లక్నో ఓటమి తర్వాత ఆటగాళ్లు చేతులు కలుపుకునే సమయంలో ఇది కాస్తా ముదిరింది. చివరకు కొహ్లీ వర్సెస్ నవీనుల్ హక్ కానూ, ఆ తర్వాత కొహ్లీ వర్సెస్ లక్నో మెంటార్ గౌతం గంభీర్ గానూ మారిపోయింది. చివరకు ఈ రెండు జోడీలు వాగ్వాదంతో పాటు పరస్పరం తోసుకునే వరకూ వెళ్లిపోయాయి. దీంతో పెద్ద గొడవ జరిగేలా కనిపించింది. ఈ దశలో ఇరుజట్లలో వారి సహచరులు జోక్యం చేసుకుని ఈ గొడవ మరింత ముదరకుండా చూశారు. మ్యాచ్ తర్వాత బీసీసీఐ కొహ్లీతో పాటు గంభీర్ మ్యాచ్ ఫీజుల్లోనూ వందశాతం కోత కూడా విధించింది. అక్కడితో ఇది ముగియలేదు.
మ్యాచ్ తర్వాత ఇన్ స్టా గ్రామ్ లో తిరిగి వార్ మొదలైంది. ముందుగా కొహ్లీ తన ఇన్ స్టా గ్రామ్ లో మనం వినేవన్నీ అభిప్రాయాలే, నిజాలు కావు, అలాగే మనం చూసేవన్నీ ఆయా కోణాలు మాత్రమే, సత్యం కాదు అంటూ పోస్ట్ చేశాడు. దీనికి స్పందించిన నవీన్ ఉల్ హక్ తన ఇన్ స్టా గ్రామ్ లోకి వెళ్లి.. "మీకు అర్హమైనది మీకు లభిస్తుంది, అది ఎలా ఉండాలి, అది ఎలా జరగాలో అలా జరుగుతుందంటూ పోస్ట్ చేశాడు. దీంతో కొహ్లీ, నవీనుల్ హక్ పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications