విశాఖకు ఉగ్రవాదుల ముప్పు , తుఫానుల బెడద ..రాజధానిగా విశాఖ ఎంతవరకు సేఫ్ !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని రగడ కొనసాగుతుంది. వైజాగ్ ను కార్యనిర్వాహక రాజధానిగా మార్చటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మూడు రాజధానులు అవసరం అని,అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని ప్రకటించిన సీఎం జగన్మోహన్ రెడ్డి వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే బాగుంటుంది అని చేసిన ప్రకటనకు అనుగుణంగా వైజాగ్ లో రాజధాని ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ఇక ఈ సమయంలో పరిపాలనా రాజధాని వైజాగ్ ఎంతవరకు సేఫ్ అన్న చర్చ ఏపీలో జోరుగా జరుగుతుంది.

సముద్ర తీరాన ఉన్న వైజాగ్ రాజధానిగా ఎలా సేఫ్
ప్రస్తుతం వున్న అమరావతిని లిజిస్లేచర్ రాజధానిగా కొనసాగిస్తామని చెప్పిన సీఎం జగన్ ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నం ను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఇక జగన్ ఆలోచనల మేరకే క్యాపిటల్ గా వైజాగ్ రూపు మారబోతుంది. ఇక ఈ సమయంలో రాజధానిగా అమరావతి సేఫ్ కాదని ముంపు ప్రాంతమని చెప్పిన వైసీపీ వైజాగ్ రాజధానిగా సేఫ్ అని ఎలా భావిస్తుంది అని అందరూ చర్చిస్తున్నారు. ఎందుకంటె సముద్ర తీరాన ఉన్న వైజాగ్ కు తుఫాన్ల బెడద ఎక్కువ . గత ప్రభుత్వ హయాంలో పలు తుఫాన్లు ఉత్తరాంధ్రలోని పలు జిల్లాలపై విరుచుకుపడ్డాయి.

వైజాగ్ కు తుఫాన్లు, సునామీల పెను ముప్పు
తిత్లీ తుఫాను , ఫణి తుఫాను, హుద్ హుద్ తుఫాను, పెథాయ్ తుఫాను, బుల్ బుల్ ఇలా తుఫాన్లు ఏపీని వణికించాయి. 1971 నుండి 2018 వరకు 70 శాతం తుఫాన్లు ఉత్తరాంధ్రలో సముద్ర తీరం దాటిన రికార్డులు ఉన్నాయి. ఉత్తరాంధ్ర తీరం తుఫాన్లకు కేంద్ర బిందువని వాదన వినిపిస్తుంది. అంతే కాదు విశాఖకు సునామీ ప్రమాదం కూడా లేకపోలేదు. ఇక అలాంటి సమయంలో వైజాగ్ ఏ మాత్రం రాజధానిగా శ్రేయస్కరం కాదని పలువురు భావిస్తున్నారు.

1971- 2018 వరకు 54 తుఫానుల్లో 20 తుఫాన్లు ఉత్తరాంధ్రలోనే
1971లో వచ్చిన తీవ్ర తుఫాను నుండి 2018 వరకు వచ్చిన 54 తుఫానుల్లో 20 తుఫాన్లు ఉత్తరాంధ్రపైనే తీవ్ర ప్రభావం చూపించాయి. ఇక 2014లో హుద్ హుద్ తుఫాను విశాఖను అతలాకుతలం చేసింది. ఇక ఇలాంటి తుఫాన్ల బెడద , సునామీ ప్రమాదం పొంచి ఉన్న నేపధ్యంలో వైజాగ్ లో పరిపాలనా రాజధాని మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇక అంతే కాదు విశాఖపై ఉగ్రవాదులు పంజా విసిరే అవకాశం ఉందని గతంలోనే ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.

ఉగ్రవాదుల ముప్పు ఉందన్న ఇంటిలిజెన్స్ .. పహారా కాస్తున్న రక్షణా దళాలు
గత సెప్టెంబర్ లో విశాఖకు ఉగ్రవాదుల ముప్పు ఉందని ఇంటిలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి నివారణ చర్యలలో భాగంగా నేవీ కోస్టల్ గార్డ్స్ మరియు సిఐఎఫ్ఎఫ్ రక్షణ చర్యలు చేపడుతున్నారు. ఉగ్రవాద దాడులను నివారించడానికి వారి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి కాపలా కాస్తున్నారు. ఐదు నెలల నుండి అన్ని రక్షణా దళాలు సంయుక్తంగా తీరం వెంబడి పహారా కాస్తున్నాయి. ఇక ఇంత ముప్పు పొంచి ఉన్న విశాఖ కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేస్తే ఇబ్బందులు ఉంటాయనే చర్చ జరుగుతుంది.

వైజాగ్ ఏ రకంగా సేఫ్ అన్న అంశంపైనే చర్చ
జిఎన్ రావు కమిటీ నివేదిక మరియు బోస్టన్ కమిటీ నివేదిక విశాఖపట్నం రాజధానికి ఉత్తమమైన ప్రదేశమని సూచించిన విషయం తెలిసిందే. ఇక హై పవర్ కమిటీ సైతం ఇరు కమిటీల నివేదికలను అధ్యయనం చేస్తూ సీఎం జగన్ నిర్ణయానికి అనుగుణంగానే నివేదిక ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపధ్యంలో సముద్ర తీర ప్రాంతం అయిన వైజాగ్ ఏ రకంగా సేఫ్ అని సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారో అర్ధం కాని పరిస్థితి.












Click it and Unblock the Notifications