విశాఖ రాజధాని పేరుతో మోసం: వైసీపీ సీఎం జగన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి- పవన్ కల్యాణ్ పట్టు
విశాఖపట్నం నుంచి పాడేరు వరకు 120 కిలోమీటర్ల దూరం మేర చిన్నారి మృతదేహాన్ని తరలించిన ఉదంతంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
విశాఖపట్నం: విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రిలో అనారోగ్యంతో మరణించిన నవజాత శిశువును దంపతులు బైక్ పై తమ స్వస్థలానికి తీసుకెళ్లిన ఘటన పట్ల జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. పరిపాలనలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఆ దంపతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆవేదన కలిగించింది..
చిన్నారి మృతదేహాన్ని పాడేరుకు తరలించడానికి కేజీహెచ్ ఆసుపత్రి సిబ్బంది ఆ గిరిజన దంపతులకు అంబులెన్స్ ను ఇవ్వడానికి నిరాకరించారు. దీనితో ఆ చిన్నారి తల్లితండ్రులు విశాఖపట్నం నుంచి పాడేరు వరకు 120 కిలోమీటర్ల దూరం మేర ద్విచక్ర వాహనంపై మృతదేహాన్ని తీసుకెళ్లారు. ఈ ఘటన తనను తీవ్ర ఆవేదన కలిగించిందని పవన్ కల్యాణ్ అన్నారు.

ద్విచక్ర వాహనంపై..
పాడేరు ముంచింగి పుట్టు మాండ్లమ్ కుమడ గ్రామానికి చెందిన మహేశ్వరి, కొండబాబు దంపతులు పుట్టెడు శోకాన్ని దిగమింగుకొని ఆ శిశువు మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లారని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. ఆ దంపతుల ఆవేదన విన్న ఎవరికైనా గుండె కరుగుతుందని, ఇది పాషాణ ప్రభుత్వం కావడం వల్ల స్పందించట్లేదని ధ్వజమెత్తారు.

ఎస్టీ సెల్..
కేజీహెచ్ లో గిరిజనులకు సాయపడేందుకు ఏర్పాటు చేసిన ఎస్టీ సెల్ గానీ, ఆసుపత్రిలో ఉన్నతాధికారులు గానీ ఈ ఘటనను పట్టించుకోకపోవడం అమానవీయమని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఆసుపత్రుల నిర్వహణ, ప్రజారోగ్యంపై పాలకులు ఎంత శ్రద్ధ చూపుతున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని అన్నారు.

సీఎం క్షమాపణ చెప్పాలి..
బిడ్డ మృతదేహంతో 120 కిలోమీటర్ల దూరం పాటు మోటార్ సైకిల్ మీద వెళ్లిన ఆ గిరిజన దంపతులకు వైసీపీ సీఎం క్షమాపణలు చెప్పాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఈ తరహా ఘటన మన రాష్ట్రంలో మొదటిది కాదని, కొద్ది నెలల కిందటే తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి బిడ్డ మృతదేహాన్ని తరలించేందుకు ఓ తండ్రి పడ్డ ఆవేదనను రాష్ట్ర ప్రజలు మరచిపోలేదని గుర్తు చేశారు.

గతంలోనూ..
మచిలీపట్నం సముద్ర తీరంలో ఓ బాలుడు చనిపోతే ఆ బిడ్డ మృతదేహాన్ని బంధువులు బైక్ మీద తీసుకువెళ్లారని చెప్పారు. ఆసుపత్రుల్లో ఉన్న మహాప్రస్థానం వాహనాల పథకం ఏమైంది? మహాప్రస్థానం వాహనాలే కాదు, అంబులెన్సుల నిర్వహణ కూడా సక్రమంగా ఉండటం లేదని పవన్ కల్యాణ్ ఆరోపించారు.

అంబులెన్సులు నిలబెట్టి..
విజయవాడ బెంజి సర్కిల్ లో అంబులెన్సులు నిలబెట్టి డ్రోన్ విజువల్స్ తీసి జెండా ఊపితే ప్రయోజనం ఉండదని హితవు పలికారు. వైద్య ఆరోగ్య శాఖకు రూ.14,000 కోట్ల బడ్జెట్ ఇచ్చామని చెబితే సరిపోదని, ప్రజలకు సేవలు అందాలని అన్నారు. ఆసుపత్రుల్లో కనీస సదుపాయాలు కల్పించలేని పాలకులు తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే విశాఖలో రాజధాని అభివృద్ధి చేస్తాం.. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications