విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కేసీఆర్‌కు కీలక నివేదిక..కొంటే లాభమేనా? నివేదికలో అంశాలివే!!
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై ముందుకు వెళతామని, ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం తేల్చి చెప్పిన నేపథ్యంలో తెలంగాణ సర్కార్ బిడ్డింగ్ విషయంలో మరో అడుగు ముందుకు వేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజా పరిణామాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో బిడ్డింగ్ వెయ్యాలా వద్దా అన్న దానిపై అధ్యయనం చేసింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ లో వాటాలను దక్కించుకోవడం కోసం బిడ్డింగ్ వేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు పలువురు సింగరేణి అధికారులను విశాఖ స్టీల్ ప్లాంట్ కు పంపించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు వెళ్లిన సింగరేణి అధికారులు రెండు రోజులపాటు విశాఖలోని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతోను, కార్మిక సంఘాలతోను భేటీ అయ్యారు. రెండు రోజులపాటు అక్కడే ఉండి స్టీల్ ప్లాంట్ పై అధ్యయనం చేసి వచ్చారు.

సింగరేణి అధికారులు తాము అధ్యయనం చేసినటువంటి అంశాలను నివేదిక రూపంలో నేడు సీఎం కేసీఆర్ కి అందించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి మూలధన సమకూర్చడం వల్ల కలిగే లాభం ఏంటి? విశాఖ స్టీల్ ప్లాంట్ పై పెట్టుబడి పెడితే దాన్ని ఎలా తిరిగి రాబట్టుకోవచ్చు? విశాఖ స్టీల్ ప్లాంట్ లో పెట్టుబడులు లాభమా? నష్టమా? వంటి అన్ని వివరాలను నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం.
విశాఖ స్టీల్ ప్లాంట్ చాలా పెద్దదని నిధులు సమకూరిస్తే లాభాల బాట పట్టే అవకాశం ఉందని ఆ నివేదికలో సింగరేణి అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ కు ముడి సరుకు సమస్య ఉందని, ముడి సరుకును సరఫరా చేసే సంస్థలు, స్టీల్ ఉత్పత్తులను కొనుగోలు చేసే సంస్థలు ముందుకొస్తే స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు గుర్తించినట్లు సమాచారం.

విశాఖ స్టీల్ ప్లాంట్ నేరుగా కొంటే లాభదాయకంగా ఉంటుందని కూడా వారు నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. రాష్ట్రంలో ప్రాజెక్టులకు ప్రతి సంవత్సరం మూడు లక్షల టన్నుల ఇనుము అవసరం అవుతుందని, స్టీల్ ప్లాంట్ కొంటే ఆ అవసరం తీరుతుందని నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. ఇక ఈ నివేదిక సీఎం కేసీఆర్ కు అధికారులు నేడు అందించనున్నారు. ఇక దీంతో నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలు విషయంపై సీఎం కేసీఆర్ నివేదిక తర్వాత నిర్ణయం తీసుకోనున్నారని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications