Weather forecast: ఉపరితల ఆవర్తనం: ఇంకో 72 గంటల్లో..: ఏపీ, తెలంగాణ సహా
విశాఖపట్నం: రెండు తెలుగు రాష్ట్రాల్లో అడపాదడపా వర్షాలు కురుస్తోన్నాయి. ఫలానా ప్రాంతం, రీజియన్ అనే తేడాలేవీ ఉండట్లేదు. ఏపీ, తెలంగాణల్లో దాదాపు అన్ని జిల్లాల్లోనూ క్రమం తప్పకుండా కుండపోత వానలు పడుతున్నాయి. శని, ఆదివారాల్లో వర్షాల తీవ్రత అధికంగా నమోదైంది. గుంటూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఆదివారం కూడా అదే పరిస్థితి కొనసాగింది. వర్షాల దెబ్బకు కర్నూలు జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం మంత్రాలయం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Recommended Video
ఇదే పరిస్థితి వచ్చే 72 గంటల పాటు ఉండటానికి అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తోన్నారు. ఏపీ కోస్తా తీర ప్రాంతం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. సముద్ర మట్టం నుంచి సుమారు నాలుగున్నర కిలోమీటర్ల ఎత్తున ఏర్పడ్డ ఈ ఉపరితల ఆవర్తనం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మరో ఆవర్తనం ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి 3.1 కిలో మీటర్ల ఎత్తున వ్యాపించి ఉన్నట్లు తెలిపారు.

దీని ప్రభావంతో సోమ, మంగళ వారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో వర్షపాతం నమోదవుతుందని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుందని, పిడుగులు పడే అవకాశం ఉందని సూచించారు. సోమవారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షం పడుతుందని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని అంచనా వేశారు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడుపి, చిక్కమగళూరు, కొడగు, శివమొగ్, హసన జిల్లాల్లో సోమ, మంగళ, బుధ వారాల్లో భారీ వర్షాలు కురవడానికి అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది.












Click it and Unblock the Notifications