నయా స్టైల్ 'ఎగ్ పులావ్'.. ఇదొక్కడి యాడ్ చేస్తే చాలు టేస్ట్ అద్దిరిపోద్దీ..!
గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. గుడ్డులో అనేక పోషకాలు ఉన్నాయి. అందుకే రోజుకో గుడ్డు తినాలని వైద్యులు సూచనలు చేస్తుంటారు. అయితే గుడ్డును అనేకమంది ఉడకపెట్టుకుని, ఫ్రై చేసుకుని తింటారు. మరికొంత మంది ఆమ్లెట్ వేసుకుంటారు. ఇంకొంతమంది ఎగ్ బిర్యానీ చేసుకుంటారు. అయితే గుడ్డుతో సూపర్ టేస్టీ పులావ్ ఎప్పుడైనా ట్రై చేశారా..? ఇలా చేస్తే ఎగ్ పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ ఎగ్ పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి..? తయారీ విధానం ఇప్పుడు చూద్దాం..
ఎగ్ పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే కోడిగుడ్లు ఉడకపెట్టినవి ఐదు లేదా ఆరు, బాస్మతి బియ్యం రెండు కప్పులు, బిర్యానీ దినుసులు(షాజీరా, ఆకు, దాల్చిన చెక్క) తగినంత, ఉల్లిపాయలు రెండు పెద్దవి పొడవుగా తరిగినవి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ తగినంత, కారం తగినంత, గరం మసాలా పొడి ఒక టేబుల్ స్పూన్, కొత్తిమీర, పూదీనా ఆకులు తగినన్ని, పెరుగు అరకప్పు, ఉప్పు రుచికి సరిపడా, నిమ్మకాయ రసం ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి.
ఎగ్ పులావ్ తయారీ విధానం చూస్తే ముందుగా బియ్యాన్ని కడిగి 30 నిమిషాలపాటు నానబెట్టుకోవాలి. అలాగే గుడ్లను ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్రలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. బిర్యానీ దినుసులు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బంగారం రంగు వచ్చే వరకూ వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకూ వేయించాలి.

ఆ తర్వాత ఆ మిశ్రమంలోనే పసుపు, కారం, పెరుగు, గరం మసాలా వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఉడికించిన గుడ్లను అందులో వేసి 2 నిమిషాల పాటు మెల్లగా వేయించుకోవాలి. ఎక్కువసేపు వేయించకూడదు. ఆ తర్వాత అందులోనే కొత్తిమీర, పూదీనా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని వేసి 2 నిమిషాలు మెల్లగా కలుపుకోవాలి. అందులోనే తగినంత నీళ్లు పోయాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు నీరు మరిగి, అన్నం 70 శాతం ఉడికిన తర్వాత మంటను తగ్గించుకోవాలి. అలా 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరి.. సూపర్ టేస్టీ ఎగ్ పులావ్ రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications