అఖిలేష్ యాదవ్ ఇంట్లో తీవ్ర విషాదం
సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సోదరుడు ప్రతీక్ యాదవ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 38 సంవత్సరాలు. లక్నోలోని సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య అపర్ణా యాదవ్, పిల్లలు ఉన్నారు. అపర్ణా యాదవ్ ఉత్తర ప్రదేశ్ బీజేపీ నాయకురాలు. దీంతో సమాజ్ వాది పార్టీలో విషాద ఛాయలు అలముకున్నాయి.
కొంతకాలంగా ప్రతీక్ యాదవ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను ఈ తెల్లవారుజామున లక్నోలోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆయనను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మరణించినట్లు ప్రకటించారు. ఆయన మరణానికి ప్రధాన కారణం ఏమిటనేది ఇంకా తెలియరావట్లేదు. ప్రతీక్ గుండెపోటు లేదా బ్రెయిన్ హెమరేజ్‌తో మరణించి ఉండవచ్చని భావిస్తోన్నారు.

ప్రతీక్ మరణవార్తతో సైఫాయి నుండి లక్నో వరకు అందరూ విషాదంలో మునిగిపోయారు. ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు, స్నేహితులు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. కొద్దిసేపటి తర్వాత ఆయన మృతదేహాన్ని అంబులెన్స్ ద్వారా ఇంటికి తరలించారు, బంధువులు, సన్నిహితులు నివాళులర్పించారు. ప్రతీక్ యాదవ్.. ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధనా గుప్తా కుమారుడు. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటోన్నారు. రియల్ ఎస్టేట్, ఫిట్‌నెస్ వ్యాపారంలో రాణించారు.
లక్నోలో ఆయన నెలకొల్పిన జిమ్ 'ది ఫిట్‌నెస్ ప్లానెట్' చాలా ప్రసిద్ధి చెందింది. రాజకీయ కుటుంబంలో సభ్యుడైనప్పటికీ ఎప్పుడూ ఆ దిశగా అడుగులు వేయలేదు. రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. రియల్ ఎస్టేట్, ఫిట్ నెస్ రంగంలో రాణిస్తున్నారు. గతంలో అపర్ణా యాదవ్‌తో విడాకుల పుకార్ల కారణంగా ప్రతీక్ వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత అపర్ణ, ప్రతీక్‌ల మధ్య అంతా సవ్యంగా ఉన్నట్లు తేలింది.
వీరిద్దరి స్నేహం పాఠశాల రోజుల నుండే ప్రారంభమై, కొంతకాలం తర్వాత ప్రేమగా మారింది. 2011 డిసెంబర్‌లో వారు వివాహం చేసుకున్నారు. ప్రతీక్ యాదవ్- అపర్ణ యాదవ్ లది ప్రేమ వివాహం. ప్రతీక్ యాదవ్ విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. లండన్‌లోని లీడ్స్ యూనివర్సిటీ నుంచి ఆయన ఎంబీఏ డిగ్రీని పొందారు. ఆయన వ్యక్తిత్వం, వృత్తిపరమైన విజయాలు, కుటుంబ నేపథ్యం కలిపి ప్రతీక్ యాదవ్‌ను ములాయం కుటుంబంలో ప్రత్యేక వ్యక్తిగా నిలిపాయి.












Click it and Unblock the Notifications