అరకులోయలో విషాదం... ముగ్గురు పిల్లలు సహా తల్లి మృతి... హత్యలేనని ఆరోపణలు...
విశాఖ జిల్లా అరకులోయలో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళ,ఆమె ముగ్గురు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పిల్లలకు పురుగుల మందు తాగించిన తన భార్య... ఆపై ఉరివేసుకుని చనిపోయిందని ఆమె భర్త చెబుతున్నారు. మరోవైపు మృతురాలి తల్లిదండ్రులు... అల్లుడే తమ కూతురిని,పిల్లలను హత్య చేశాడని ఆరోపిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే... అరకులోయలోని సి కాలనీలో శెట్టి సంజీవ్-సురేఖ దంపతులు నివసిస్తున్నారు. వీరికి కుమార్తె సుశాన(9),కుమారులు షర్విన్(6),సిరిల్(4) ఉన్నారు. సంజీవ్ గిరిజన సహకార సంస్థలో కాంట్రాక్ట్ సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నారు. ఏమైందో తెలియదు గానీ భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. సంజీవ్,సురేఖ తరుచూ గొడవలు పడుతున్నారు.
ఇదే క్రమంలో శుక్రవారం(జులై 16) రాత్రి సురేఖ ఇంట్లో ఉరేసుకుని కనిపించింది. ముగ్గురు పిల్లలు మంచంపై విగజీవులై పడి వున్నారు. పిల్లలకు విషం తాగించిన తన భార్య... ఆపై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆమె భర్త సంజీవ్ చెబుతున్నారు.మృతురాలి తండ్రి మాత్రం అల్లుడే తన కూతురిని,పిల్లలను హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. నలుగురిని హత్య చేసి ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు.

మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నలుగురి మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా మృతురాలి భర్త,ఆమె తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్దకు చేరుకోగా... ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
కొద్ది రోజుల క్రితం ఇదే విశాఖ జిల్లాలోని చోడవరంలో 14 ఏళ్ల ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే.ఓ బాలుడితో కలిసి బయటకు వెళ్లిన బాలిక ఉరివేసుకుని కనిపించింది.బాలిక టవల్‌తో ఉరివేసుకుని చనిపోయిందని ఆ బాలుడే మొదట ఆమె తల్లిదండ్రులకు సమాచారమిచ్చాడు. తమ కూతురి మృతిపై అనుమానాలున్నాయని ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.












Click it and Unblock the Notifications