అనకాపల్లి జిల్లా పోరస్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్-కళ్లమంటలు, వాంతులతో కార్మికులు ఆస్పత్రి పాలు
ఏపీలోని ఉత్తరాంధ్ర ప్రాంతంలోని పరిశ్రమల్లో వరుసగా చోటు చేసుకుంటున్న ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే విశాఖలోని పారిశ్రామికవాడల్లో గ్యాస్, విషవాయువుల లీక్, బ్లాస్ట్ లు చోటు చేసుకున్నాయి. ఇదే క్రమంలో ఇవాళ అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురంలో మరో ఘటన చోటు చేసుకుంది.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ ఎస్ఈజెడ్ పరిధిలోని పోరస్ కంపెనీలో అమ్మోనియా గ్యాస్ లీకైంది. దీంతో సమీపంలోని సీడ్స్ కంపెనీలో పనిచేస్తున్న కొంతమంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు. ఆ వాయువు పీల్చడంతో మహిళలకు తల తిరగడం, కళ్ల మంటలు రావడంతో పాటు వాంతులు అయ్యాయి. దీంతో సదరు మహిళలను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం వారిని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు.

అమ్మెనియా పీల్చడంతో మహిళలు స్పృహ తప్పిపోయారని ప్రాణాపాయం ఉండదని వైద్యసిబ్బంది చెబుతున్నారు. మరోవైపు పోరస్ కంపెనీలో అమ్మోనియా లీకేజీని నిర్ధారించిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టారు.

పోరస్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగారు. గ్యాస్ లీక్ కు గల కారణాలను తెలుసుకోవడంతో పాటు దాన్ని నియంత్రించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పరిశ్రమల్లో జరుగుతున్న వరుస ప్రమాదాలతో కార్మికుల్లోనూ భయాందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోరస్ ఫ్యాక్టరీ ప్రమాదం కూడా జనాన్ని భయపెడుతోంది.
అచ్యుతాపురంలో అమ్మోనియా గ్యాస్ లీక్, బ్రాండెక్స్‌లో పనిచేస్తున్న మహిళలకు అస్వస్థత ఘటనపై అధికారులనుంచి సీఎం జగన్ వివరాలు కోరారు. ఘటనకు దారితీసిన కారణాలను వివరించిన సీఎంఓ అధికారులు...సంబంధిత జిల్లా కలెక్టర్ వెంటనే వెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారని సీఎంకు తెలిపారు. గ్యాస్ లీక్‌ను కూడా నియంత్రించారని తెలిపారు. బ్రాండిక్స్‌లో ఒక యూనిట్‌లో పనిచేస్తున్న మహిళలను అందర్నీ ఖాళీ చేయించామని, అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించారని సీఎంకు వివరించారు. అంతా కోలుకుంటున్నారని, క్షేమంగా ఉన్నారని తెలిపారు.
అమ్మోనియా ఎక్కడనుంచి లీకైందన్న అంశంపై అధికారులు దర్యాప్తు చేపట్టారన్నారు. అస్వస్థతకు గురైన వారికి మంచి వైద్యాన్ని అందించాలని సీఎం ఆదేశించారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేసి, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు. ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా స్థానిక మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను సీఎం ఆదేశించారు. వెంటనే ఆయన విజయవాడ నుంచి అనకాపల్లి బయల్దేరి వెళ్లారు.












Click it and Unblock the Notifications