మీడియాలో అడుగు పెట్టబోతున్నా - చూసుకుందాం రా రాము: సాయిరెడ్డి సవాల్
విశాఖపట్నం: విశాఖపట్నంలో దసపల్లా భూముల వివాదంపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి స్పందించారు. తనపై ఉద్దేశపూరకంగా దుష్ప్రచారం చేస్తోన్నారని అన్నారు. ఒక పత్రిక, ఒక టీవీ ఛానల్ ఉంది కాబట్టే రామోజీరావు తనపై దుష్ప్రచారం చేస్తోన్నాడని ఆరోపించారు. తాను ఇప్పటివరకు ఏ వ్యాపార రంగంలో ప్రవేశించలేదని, ఇప్పుడా పని చేయబోతోన్నానని ప్రకటించారు. మీడియా రంగంలో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిపారు.

తానే స్వయంగా ఛానల్..
ఈ మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో మంత్రులు గుడివాడ అమర్‌నాత్, బూడి ముత్యాలనాయుడుతో కలిసి మాట్లాడారు. దసపల్లా భూముల విషయంలో ఆయన ఘాటు విమర్శలు చేశారు. ఏ మీడియా రంగంలో రాము (రామోజీరావు) ఉన్నాడో.. అదే మీడియా రంగంలో తాను అడుగు పెట్టబోతోన్నానని స్పష్టం చేశారు. త్వరలో తాను ఓ న్యూస్ ఛానల్‌ను పెట్టబోతోన్నానని తేల్చి చెప్పారు. మీడియాలో రాజకీయ ప్రత్యర్థులపై దుష్ప్రచారం చేస్తోన్నందున వల్ల తాను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు.

ఏ రంగంలో ఉన్నారో..
ఏ మీడియా సంస్థ ఏ రకంగా పని చేస్తుందో తేల్చుకుందామని విజయసాయి రెడ్డి ఛాలెంజ్ చేశారు. రామోజీరావు రంగంలో తాను ఎంటర్ కాబోతోన్నానని, దీన్ని ఛాలెంజ్ తీసుకుంటున్నానని సాయిరెడ్డి అన్నారు. రామోజీ రావు అడిగినట్టుగా లేదా ఆయన తొత్తులు (తెలుగుదేశం పార్టీ నాయకులు) డిమాండ్ చేసినట్టుగా తాను సీబీఐ దర్యాప్తును ఎదుర్కొనడానికి సంసిద్ధంగా ఉన్నానని చెప్పారు. తన ప్రమేయం ఏదీ లేనప్పటికీ దసపల్లా భూముల వివాదంలో ఉద్దేశపూరకంగా రామోజీ రావు తన పేరును వాడుతున్నారని ధ్వజమెత్తారు.

చంద్రబాబును సీఎంగా..
కలంలో కులాన్ని నింపి వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. తన కులానికి చెందిన ఓ నాయకుడిని మళ్లీ గెలిపించాలని, ఆయనను శాశ్వతంగా సీఎం కుర్చీలో కూర్చోపెట్టాలనే కుల పిచ్చితో.. శాశ్వతంగా అది సాధ్యం కాదని తెలిసి కూడా.. నీచపు రాతలు రాస్తున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. విశాఖపట్నంలో మెజారిటీ భూములు కొనుగోలు చేసిన వారిలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారే అధికంగా ఉన్నారని చెప్పారు.

విశాఖను అడ్డుకోవడానికే..
విశాఖపట్నానికి రాజధాని రాకుండా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పని చేస్తోన్న కొన్ని మీడియా సంస్థలు అడ్డుకుంటున్నాయని సాయిరెడ్డి ఆరోపించారు. ఉత్తరాంధ్రకు, విశాఖపట్నానికి కార్యనిర్వాహక రాజధాని రాకుండా చెయ్యాలని, అమరావతిలో పెద్ద సంఖ్యలో కోట్ల రూపాయలను పెట్టి భూములను కొన్నందుకు రాజధాని తరలి వెళ్లకుండా అనుక్షణం అడ్డుపడుతున్నారని విమర్శించారు. విశాఖ దసపల్లా భూములపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదని విజయసాయి రెడ్డి వివరించారు.

బ్రాహ్మణి-బాలకృష్ణ పేరు..
దసపల్లా భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని.. అమరావతిలో జరిగింది ఆన్‌సైడర్ ట్రేడింగ్ అంటూ కొందరు సన్నాసులు చెబుతున్నారని సాయిరెడ్డి విమర్శించారు. ఈ విషయంలో ఆయన చంద్రబాబు కోడలు బ్రాహ్మణి పేరును ప్రస్తావించారు. బాలకృష్ణ తన కుమార్తె బ్రాహ్మణిని చంద్రబాబు ఇంటికి కోడలిగా పంపించాడని, ఆమె సంపాదన అంతా చంద్రబాబు కుటుంబానికి చెందుతుందే తప్ప బాలకృష్ణకు దక్కదని అన్నారు.












Click it and Unblock the Notifications