చనిపోయిన వ్యక్తుల పేర్లతోనూ పిటిషన్లు: టీడీపీపై జనం తిరుగుబాటు: విజయసాయి రెడ్డి
విశాఖపట్నం: అధికార వైెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి తెలుగుదేశంపై మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోన్న నవరత్నాల్లో ఒకటి- పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ పథకాన్ని అడ్డుకోవడానికి టీడీపీ శాయశక్తులా ప్రయత్నిస్తోందంటూ ధ్వజమెత్తారు. పేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తోన్న కార్యక్రమాలపై బురదజల్లుతోందని మండిపడ్డారు.
విశాఖపట్నంలో ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించారు. మధురవాడలోని తన కార్యాలయంలో సాయన్న ప్రజాదర్బార్‌ను ఇటీవలే ప్రారంభించారు. మధురవాడ ఎంఎస్ఆర్ లేఅవుట్‌లో బట్టర్ ఫ్లై థీమ్ పార్క్, మల్కాపురం ఏరియాలో మంచినీటి సరఫరా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లను నిర్మించి ఇస్తామనే హామీని.. అధికారంలోకి వచ్చిన తొలి రెండేళ్లలోనే అమలు చేస్తున్నామని అన్నారు.

దీన్ని అడ్డుకోవడానికి చంద్రబాబు, ఆయన పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. పేద ప్రజలకు తెలుగుదేశం పార్టీ ఏనాడో దూరమైందని ధ్వజమెత్తారు. పేదలకు దక్కాల్సిన ఇళ్లను అడ్డుకోవడానికి న్యాయస్థానాలను సైతం అడ్డుగా పెట్టుకోవడానికి తెలుగుదేశం పార్టీ వెనుకాడట్లేదంటూ విజయసాయి రెడ్డి ఆరోపించారు. పేదలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పని చేస్తోందని అన్నారు. టీడీపీపై ప్రజలు తిరుగుబాటు చేసే రోజు వస్తుందని హెచ్చరించారు.
Recommended Video
చనిపోయిన వ్యక్తుల పేర్లతోనూ ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోవడానికి పిటిషన్లు వేయించిందని విజయసాయి రెడ్డి అన్నారు. పేదలందరికీ ఇళ్లను కేటాయించడాన్ని తెలుగుదేశం పార్టీ ఎన్నో రోజుల పాటు అడ్డుకోలేదని అన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోవడమంటే అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపడంలాంటిదేనని ఆయన చెప్పారు. ఈ మబ్బులు తొందరలోనే తొలగిపోతాయని పేర్కొన్నారు. పేద ప్రజలకు వ్యతిరేకంగా.. అధికారాన్ని అందుకోవాలనే ఏకైక లక్ష్యంతో పని చేస్తోన్న టీడీపీపై తిరుగుబాటు చేయడం ఖాయమని అన్నారు.












Click it and Unblock the Notifications