విశాఖ స్టీల్స్ ప్రైవేటీకరణపై తేల్చేసిన కేంద్ర ఉక్కు మంత్రి: వైసీపీ ఎంపీ ప్రశ్నకు ఇదీ జవాబు
విశాఖపట్నం: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రతిపాదించిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం ఈ ఉదయం లోక్‌సభలో ప్రస్తావనకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలకు తలమానికంగా ఉంటోన్న ఈ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం కానివ్వకుండా శాయశక్తులా ప్రయత్నిస్తామని, 120 మంది ఎంపీల సంతకాలను సేకరించామంటూ వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వీ. విజయసాయి రెడ్డి ప్రకటించిన మరుసటి రోజే- కేంద్రం తన వైఖరి ఏమిటనేది మరోసారి స్పష్టం చేసింది.

వైసీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు..
విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించ వద్దంటూ రాజమహేంద్రవరానికి చెందిన వైసీపీ ఎంపీ మార్గాని భరత్.. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు ప్రజల ప్రాణత్యాగాల మీద ఈ ఫ్యాక్టరీ ఏర్పాటైందని అన్నారు. వేలాదిమంది తమ భూములను దీనికి ఇచ్చారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం తన పెట్టుబడులను ఉపసంహరించుకోవడం వల్ల వారి త్యాగాలు వృధా అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. వందలాదిమంది తమ ఉద్యోగాలను కోల్పోతారని అన్నారు. వారి ఉద్యోగాలకు భరోసా ఉండదని మార్గాని భరత్ అన్నారు.

సొంతంగా గనులను కేటాయించకపోవడం వల్లే..
విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి కేంద్ర ప్రభుత్వం సొంతంగా గనులను కేటాయించకపోవడం వల్లే నష్టాలు వస్తోన్నాయనేది అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ 20 వేల కోట్ల రూపాయలు పైగా టర్నోవర్‌ను సాధిస్తోందని చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను లాభాల్లోకి ఎలా తీసుకుని రావచ్చో వివరిస్తూ తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ కూడా రాశారని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు పేరుతో ఈ ఫ్యాక్టరీని తెలుగు ప్రజలు పోరాడి సాధించుకున్నారని వివరించారు.

ప్రైవేటీకరణకు ఒప్పుకోరు..
ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగు ప్రజలు ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు అంగీకరించబోరని మార్గాని భరత్ అన్నారు. తెలుగు వారు స్వచ్ఛందంగా వేల ఎకరాలను ఫ్యాక్టరీ నిర్మాణానికి ఇచ్చారని చెప్పారు. సొంతంగా గనులను కేటాయించి, ఈ ఫ్యాక్టరీని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలని కోరారు. దీనికి- ఉక్కు శాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్ ఇచ్చిన సమాధానం ఇచ్చారు. ఈ స్టీల్ ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందని తేల్చి చెప్పారు. ఏడువేల కోట్లకు పైగా నష్టాన్ని చవి చూడటం వల్ల విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలని ప్రతిపాదనలు చేయాల్సి వచ్చిందని వివరించారు.
Recommended Video


ఉత్పాదకత తక్కువ..
వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ఉత్పాదకత తక్కువగా ఉందని కేంద్ర మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్ స్పష్టం చేశారు. సొంతంగా గనులను కేటాయించడం వల్ల సమస్య పరిష్కారం కాదని అన్నారు. కంపెనీ నష్టాల్లో నడుస్తోందని పునరుద్ఘాటించారు. అందుకే పెట్టుబడులను ఉపసంహరించుకోవాల్సి వస్తోందని చెప్పారు. అన్నీ చర్చించిన తరువాత పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ సంస్థల చేతికి ఈ స్టీల్ ప్లాంట్‌ను అప్పగించడం ద్వారా కూడా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని కేంద్రమంత్రి తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications