కాలిఫోర్నియా: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డిపై గురువారం పాశవికంగా జరిగిన దాడిని పాలమూరు ఎన్నారై సంస్థ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. పిఎన్నారై సంస్థలోని వెయ్యి మంది సభ్యులు ముక్త కంఠంతో నాగంపై దాడి చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు స్పష్టం చేసింది. నాగంపై దాడి జరగడానికి కొద్ది గంటల ముందే పిఎన్నారై ఫోరం సభ్యులు ఆయనతో మాట్లాడినట్లు తెలిపింది.
ఆ సందర్భంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు మద్దతుగా తెలుగుదేశం ఎమ్మెల్యేలంతా పదవులకు రాజీనామాలు చేసినట్లు నాగం జనార్దన్ రెడ్డి చెప్పారని గుర్తు చేసుకుంది. నాగంపై దాడి చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని ఫోరం డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం శాంతియుతంగా నిరసన తెలియజేయాలని జేఏసీ నాయకులకు పాలమూర్ ఎన్నారై ఫోరం విజ్ఞప్తి చేసింది. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని ఫోరం అభిప్రాయపడింది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి