వాషింగ్టన్ డిసి మెట్రో తెలంగాణ గ్రూప్ ఆధ్వర్యంలో జూలై 10వ తేదీ శనివారం వర్జీనియా లోని ఫ్రయింగ్ పాన్ పార్క్ లో తెలంగాణ వన భోజనాలు కార్యక్రమం చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగింది. రెస్టారెంట్ వంటలతో పాటు, పార్కులోనే కొన్ని వంటలు వండి భోజనాలు చేసారు. ఎంతో ఆనందంగా పిల్లలు బౌన్సింగ్ ఆటల్లో, నీటితో నిండిన జారుడు బల్లలపై కేరింతలు కొట్టారు. కొందరు ఎన్నారైలు తమ గానంతో ఆహ్వానితులను అలరించారు. తెలంగాణ సాధించేదాకా మనం అవిశ్రాంతంగా పోరాటం చేయవలసిన అవసరమున్నదని ఈసందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు వేణు నక్షత్రం, జగదీశ్ బొందుగుల, విజయ్ చాట్ల, కృష్ణ దొమ్మాట, రామ్ ఎనగంటి, రమాకాంత్ పీచర తమ అభిప్రాయం తోటి మిత్రులతో పంచుకున్నారు. తెలంగాణ ఉప ఎన్నికలలో తెలంగాణకు మద్దతుగా రాజీనామా చేసిన వారందరినీ తిరిగి ఎన్నుకొని తెలంగాణా స్పూర్తిని చాటి చెప్పాలని ఎన్నారై మిత్రులందరు ఏ సందర్భంగా తెలంగాణ ప్రజలకి విజ్ఞప్తి చేసారు. జై తెలంగాణా నినాదమున్న చొక్కాలను ఉత్సాహంగా ధరించి, తెలంగాణా సాధించేదాకా విశ్రమించమని ఉద్వేగభరితంగా ప్రతిజ్ఞ చేసిన తీరు ఆకట్టుకుంది.