శివసాగర్‌ కవిత్వంపై అమెరికాలో చర్చ

 Sivasagar
“శివసాగర్ కవిత్వం” పైన డల్లాస్ నగరంలో, మే 12 వ తేదీన చైతన్య వేదిక చర్చను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో “అమ్మా నను కన్నందుకు విప్లవాభివందనాలు” అనే శివసాగర్ రాసిన పాటను నసీమ్, అనంత్ పాడారు. తానా ఫౌండేషన్ చైర్మన్ జంపాల చౌదరీ సభను ప్రారంభిస్తూ - “శివసాగర్ అనే పేరు నాకు తెలియక ముందే, ఆయన రచనలు దేశమంతా కూడా బాగా ప్రసిద్ధి చెందాయి. నిజం చెప్పాలంటే, ప్రతిరోజు మనం మాట్లాడుకునే వాడుక భాష లో, కొన్ని మాటలు కలిసిపోయాయి. అలాగే శివసాగర్ కవిత్వం కూడా మన మాటలలో కలిసిపోయింది. తాను చెప్పదలుచు కున్నది, చెప్పటంలో, శివసాగర్ ఎప్పుడు కవిత్వాన్ని మరచిపోలేదు. అందుకే ఆయన రచనలు చాలా కవితాత్మకంగా ఉంటాయి. ఒక భావజాలాన్ని, ఒక తత్వాన్ని చెప్పటానికి ఆయన కవిత్వం ఉపయోగించుకున్న మాట నిజమే, కానీ ఆ భాష లో ఒక డిక్షన్ వుంటుంది, మొక్కవోని ఆశావాహం ఉంటుంది” అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ - “గోడల మీద నినాదాలు రాసినా కూడా, వాటి లో చాలా కవిత్వం ఉంటుంది. తోటరాముడు, చెల్లీ చంద్రమ్మ లాంటి పాటలు ఆశావాదం మరియు భవిష్యత్తుపై ఆశలను వ్యక్తీకరిస్తాయి. స్పూర్తి నిచ్చే ఆశావాహాక కవిత్వం రాయటం వల్ల, మిగతావారికి లేనటు వంటి ఒక ప్రత్యేకత శివసాగర్ కి ఉంది. విప్లవ కవిత్వం అంటే కొట్టటం, చంపటం అని మనం వెక్కిరిస్తుంటాం, ఎర్రగా రక్తం ప్రవహిస్తుందని కొందరు అంటారు, కానీ శివసాగర్ కవిత్వం లో రక్తం కంటే ఆర్ధత, భావాత్మకత ఎక్కువ గా కనిపిస్తాయి” అన్నారు.

ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ - “ఆ రోజులలో కవిత్వం చదువుకునే వాళ్ళకి, శివసాగర్ అనే ఒక మనిషి వున్నాడని తెలియదు. కవితలు బాగావుండేవి, పత్రికలలో కనిపిస్తూండేవి. కానీ యివి ఎవరు రాసారని స్పష్టంగా తెలియదు. ఆయన రెంజిమ్, శివుడు, శివసాగర్ లాంటి వివిధ పేర్ల తో రాసారు. ఒక్కమనిషే, యిన్ని కవితలు రాసాడని చాలా మందికి తెలియదు, దగ్గరగా వుండే వాళ్ళకు తప్ప. కవి పేరు మీద కాకుండా, కేవలం కవితలు మూలానే, అలాగే కవిత్వంలో వున్న భావనాశక్తి వల్ల, శివసాగర్ కవితలు బాగా ప్రచారం అయ్యాయి” అని చెప్పారు.

“ప్రజలను సాయుధం చేసున్న రివల్యూషనరీ నేడు కవి” అని ఫోర్సు తీసుకు వచ్చేవాడు. అలలు లాంటి కవిత లో ఒక రాజకీయ అంశం వున్నా, సంక్లిష్టమైన విషయం వున్నా. దానిలో కవితాత్మక దృశ్యం (పొయటిక్ ఇమేజరీ) ఉంటుంది.

అలల పైన నిఘా!
అలలు కనే కలల పైన నిఘా!
అలలపై అనురాగం చూపించే
చిరుగాలి సితారా సంగీతంపై నిఘా!” అని ఆయన వివరించారు.

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాన్ టెక్స్) పూర్వ అధ్యక్షులు చంద్ర కన్నెగంటి మాట్లాడుతూ - “శివసాగర్ తనకు కావలసిన భాష అంతా కూడా, ప్రజల దగ్గర నుండే తీసుకున్నాడు. ఎందుకంటే ఎటూ ప్రజలకే చేరాలి కనుక. ఆయన టార్గెట్ ఏమిటో, ఆయనకు తెలుసుకనుక. ఆయన కవిత్వంలో భాష, ఇమేజరీ, అఖరికి జానపద శైలి కూడా బాగా పట్టుకున్నట్లు అనిపిస్తోంది. సాహిత్యం లో కొన్ని లెజండరీ పాత్రలు, కథలు ఉంటాయి. ఉద్యమంలో చనిపోయిన వారిని లెజెండ్ స్థాయికి, తీసుకు వెళ్ళటానికి పాట బాగా పనిచేసినట్లు కనిపిస్తోంది. ఆయన కవిత్వంలోని ఇమేజరీ, అడువులలో తిరగటం, పిట్టల పేర్లు వింటూ వుంటే ఆ వాతావరణం సృష్టించబడుతుంది.” అన్నారు.

నసీమ్ షేక్ మాట్లాడుతూ - “ఒక కవిత లో శివసాగర్ ‘నా కొమ్మలకు కాయలు మాత్రమే కాదు, భూస్వాముల తలలు కూడా కాస్తాయి.’ అని భావాత్మకంగా రాసారు. కొల్లిపరల రామకోటేశ్వరావును పోలీసులు పట్టుకొని, చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ , శివసాగర్ ఒక పాట రాసారు.”
తోటరాముని తొడకు కాటా తగిలిందాని
చిలుక చీటి తెచ్చెరా! ఓ విలుకాడ!
మైనా మతలబు చేసెరా! ఓ చెలికాడ!
మైనా మతలబు చేసెరా!” - అని వివరించారు.

సాజీ గోపాల్ మాట్లాడుతూ - “శివసాగర్ ప్రకృతిని ప్రేమించాడు, ప్రజలను ప్రేమించాడు,ఉద్యమాలను గుండెకు హత్తుకొని విప్లవాన్ని స్వప్నించాడు. సమాజంలోని అసమానతలు, శ్రామికుల కష్టాలు, దళితుల కన్నీళు అధ్యయనం చేసి, ఒక విప్లవ రాజకీయ ప్రత్యామ్నాయాన్ని నిర్మించాడు. ఆయన ఒక కవి, రచయిత, సిద్ధాంతకర్త యేకాదు, ఒక గొప్ప ఆచరణా వాది, స్పూర్తినిచ్చే భావవిప్లవకారుడు, దళిత మహనీయుడు. “అలల పైన నిఘా! అలలు కనే కలల పైన నిఘా!” అనే కవితలో రాజ్యానికి వుండే కౄర స్వభావాన్ని భావాత్మకంగా చెప్పాడు. శివసాగర్ కవితలలో పల్లె పదాలు, పిట్ట రాగాలు, అడవి అందాలు, ప్రకృతి కమనీయ దృశ్యాలు, విప్లవ స్వప్నాలు లాంటి కవితాత్మక దృశ్యాలుంటాయి.

విత్తనం చనిపోతూ
పంటను వాగ్దానం చేసింది
చిన్నారి పువ్వు రాలిపోతూ
చిరునవ్వుతో కాపును వాగ్దానం చేసింది

కేన్సర్ పట్టిన వ్యవస్థను మార్చాలంటే, ప్రజా పోరాటాలతో విప్లవాన్ని ఆహ్వానించాలంటాడు. నేటితరం శివసాగర్ కవిత్వాన్ని అధ్యయనం చేసి, ఆయన ఆశయాలను ఆచరణ లో పెట్టాలి.
కసితో స్వార్థం శిరస్సు గండ్రగొడ్డలితో
నరకగల్గినవాడే నేటి హీరో
ప్రజల గుండెల కొండల్లో మాటుకాసి
ట్రిగ్గర్ నొక్కగల్గినవాడే ద్రష్ట
ప్రజలను సాయుధం చేస్తున్న రివల్యూషనరీ నేడు కవి” అని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+