గల్ఫ్ అమరుల సంస్మరణ సభకు కాంగ్రెస్ సర్కారు సన్నాహాలు
గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సర్కార్.. బతుకుదెరువు కోసం ఎడారి దేశాలకు వెళ్లి అనుకోని పరిస్థితుల్లో అక్కడే మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు అండగా ఉండాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే గల్ఫ్‌లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.5 లక్షల పరిహారం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. నిధుల విడుదలకు సైతం సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చారు.
ఇప్పటికే వచ్చిన దరఖాస్తుల ఆధారంగా జాబితా సిద్ధం చేసిన అధికారులు.. 113 బాధిత కుటుంబాలున్నట్టు తెలిపారు. దీంతో.. ఒక్కొ కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున.. 113 బాధిత కుటుంబాలకు వెంటనే నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

అంతే కాకుండా గల్ఫ్ దేశాలలో మరణించిన కార్మికుల కుటుంబాలతో ప్రజాభవన్‌లో త్వరలో గల్ఫ్ అమరుల సంస్మరణ సభ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి వెల్లడించారు. గల్ఫ్ మృతుల కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి సహపంక్తి భోజన కార్యక్రమంలో పాల్గొని వారికి భరోసా ఇవ్వనున్నారని ఆయన తెలిపారు.
భారత దేశ సరిహద్దులు దాటి ఎడారి దేశాలలో పనిచేస్తూ మృతి చెందిన కార్మికులు సైనికుల లాంటి వారని, విదేశీ మారక ద్రవ్యం పంపిస్తూ ఆర్థిక జవాన్లుగా సేవలందించిన వారిని 'గల్ఫ్ అమరులు' గా స్మరించుకొని వారిని గౌరవించడం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఈ 'గల్ఫ్ భరోసా' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అనిల్ గుర్తు చేశారు. గల్ఫ్ కార్మికులు ఆయురారోగ్యాలతో, క్షేమంగా మాతృభూమికి తిరిగి రావాలని కాంగ్రేస్ ప్రభుత్వం ఆశిస్తుందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications