NRI News: గుంటూరులో జానపద, సాంస్కృతిక సంబరాలు..
భాషే రమ్యం.. సేవే గమ్యం అని నినదించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన నినాదానికి తగ్గట్టుగా గుంటూరులో జానపద, సాంస్కృతిక సంబరాలను ఘనంగా నిర్వహించింది. స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నాట్స్ జానపద, సాంస్కృతిక సంబరాల్లో వందల మంది జానపద కళాకారులు, కవులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మొదటిగా అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. డప్పు చప్పుళ్లు, కళాకారుల నృత్యం, మహిళల కోలాటం కోలాహలం మధ్య పొట్టి శ్రీరాముల విగ్రహం నుంచి వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత విజ్ఞాన మందిరంలో కళాకారుల ప్రదర్శనలు నిర్వహించారు. గాయకుల పాటలు, డప్పు కళకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

ముఖ్యంగా తెలుగు భాష గొప్పదనాన్ని చాటిచెప్పేలా ఈ కార్యక్రమాలు సాగాయి. శ్రీకాకుళం, విజయనగరం, ఉభయగోదావరి, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి జానపద , గిరిజన కళాకారులు సాంప్రదాయ వేషధారణలతో ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు, కళారూపాలు బుర్రకథలు, ఆహుతులను అలరించాయి. తాము అమెరికాలో ఉంటున్నా మా మనస్సంతా ఇక్కడ ఉంటుందని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి తెలిపారు. మన తెలుగు భాష పరిరక్షణ కోసం నాట్స్ ఎంతగానో కృషి చేస్తుందన్నారు.
దానిలో భాగంగానే నాట్స్ జానపద, సాంస్కృతిక సంబరాలు (Cultural Programs) నిర్వహిస్తుందని తెలిపారు. తెలుగు కళలను, కవులను ప్రోత్సాహించేందుకు నాట్స్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. నాట్స్ అంటే సేవ.. సేవ అంటే నాట్స్ అనే రీతిలో తమ కార్యక్రమాలు ఉంటాయని బాపు నూతి అన్నారు. కళకారులు చేసిన ప్రదర్శనలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఈ జానపద సంబరాల నిర్వహణలో శాసనమండలి సభ్యులు లక్ష్మణరావు కీలకపాత్ర పోషించారని తెలిపారు.












Click it and Unblock the Notifications