వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నారైలు అందరూ నిజంగా నాన్ రెస్పాన్సివ్ ఇండియన్సా?

By Pratap
|
Google Oneindia TeluguNews

వేసవి కాలం వచ్చింది.... ప్రవాస భారతీయ సంస్థలకు పండుగ సీజన్ తెచ్చింది. ఇక్కడ అమెరికాలో ముఖ్యంగా మన తెలుగు, తెలంగాణా సంస్థలు జరిపే వేడుకలు భారీ స్థాయిలో ఉంటాయి. తెలుగు వారికి చెందిన కనీసం ఏడు సంస్థలు (ఇటీవల ప్రారంభించిన సంస్థ సహా) తమ సంప్రదాయాలను జరుపుకునే వాటిలో ఉన్నాయి. ఈ 7 సంస్థలు కాకుండా, ప్రతి నగరం / రాష్ట్రంలో స్థానిక సంస్థలు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఈ స్థానిక సంస్థల ఏ చిన్న పండుగ కూడా మిస్ కాకుండా వారి ఉత్సవాలు జరుపుకుంటారు.

ఇక్కడ కొద్దిగా నేపథ్యం ఉంది. ఇక్కడ అమెరికాలో నెలకొల్పిన ఈ 7 జాతీయ తెలుగు సంఘాలు వారి ద్వైవార్షిక సమావేశాలు మూడు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటాయి. దాని కోసం ఒక్కొక్క సంస్థ హీన పక్షంగా రెండు నుంచి రెండున్నర మిలియన్ డాలర్లకు తగ్గకుండా ఖర్చు చేస్తారు. ఈ ఖర్చుతో పాటు, ఆ సంస్థల వారు ఒక్కొక్క నగరంలో నిధుల సేకరణకు జరిపే సన్నాహక సమావేశాల ఖర్చు అదనం.

ఇవే కాకుండా, ఈ సమావేశాలకు వివిధ ప్రాంతాల నుండి వచ్చే వారు పెట్టే ప్రయాణ ఖర్చులు, హోటల్ ఖర్చులు ఇంకొంత అదనం. మనలో దాదాపు అందరికీ ఈ సమావేశాలు ఎలా జరుగుతాయో తెలుసు. ఇప్పటి దాక ఉన్న తెలుగు సంస్థలకి తోడు, 2 తెలంగాణ సంస్థలు, ఈ సంవత్సరం రెండు "మొదటి తెలంగాణ ప్రపంచ మహాసభలు" జరుపుతున్నట్టు ప్రకటించారు. వారు ఇతరుల సంప్రదాయం కొనసాగిస్తూ ద్వైవార్షిక సమావేశాలు జరుపుకుంటారో లేదో చూడాల్సి ఉంటుంది.

నేను ఈ సంస్థలు, సమావేశాల గురించి ఎందుకు రాయాల్సి వచ్చిందంటే, ఈ మధ్య నేను భారతదేశం సందర్శించినప్పుడు, కొందరు మిత్రులు తరచూ ఎన్నారైలు అంటే, నాన్ రెస్పాన్సివ్ ఇండియన్స్ అని అవహేళన గా మాట్లాడటం విని చాలా బాధ పడ్డాను. ఎందుకంటే, నాకు తెలిసిన చాల మంది ఎన్నారైలు అనేక సంక్షోభాలు వచ్చినప్పుడు స్పందించడం చూసాను, అనేక సమస్యలపై "సామాజిక మాధ్యమాల్లో" చర్చలు చేస్తారు, కొందరైతే సంక్షోభ సమయంలో అన్నీ వదిలేసి భారత దేశం వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం చేస్తారు.

Narra Gopi on NRI organisations

కాని, అవన్నీ వ్యక్తిగతంగా అని నాకు అర్ధమయ్యింది. కానీ, ప్రపంచంలో ఉన్న ప్రవాస భారతీయులందరికీ ప్రతినిధులుగా చెప్పుకునే ఈ ఎన్నారై సంస్థలు ఈ సంవత్సరం సంభవించిన కరువు మీద స్పందించడం మానేసి ఎంచక్కా విలాసవంతమయిన సంబరాలు జరుపుకోవడం చూస్తుంటే, మా స్నేహితులు అన్న మాటలు నిజమే అనిపిస్తుంది.

ఈ సంస్థలు ఈ సదస్సుల్లో ఏమి సాధిస్తున్నారని ఒక్కసారి ఆలోచించాలి. ఉదాహరణకు ఈ సంవత్సరం తీసుకుంటే, 5 సంస్థలు తమ సమావేశాలు నిర్వహిస్తున్నాయి, చిన్న సమావేశం 500,000 డాలర్లు ఖర్చు చేస్తే, పెద్దవి కనీసం 2.5 మిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేస్తాయి. ఈ చొప్పున అన్ని సంస్థలు కలిసి, కనీసం 10 - 12 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఆ రకమైన డబ్బుతో ఎన్ని సేవా కార్యక్రమాలు చేయవచ్చో మనందరం ఊహించవచ్చు. ప్రతి సంస్థ వారి ట్యాగ్ లైన్ లో "సేవ" అని ఉంటుంది. వారు ఈ సదస్సులకు చేసే ఖర్చుతో పోలిస్తే నిజమైన "సేవ" కోసం ఎంత శాతం ఖర్చు పెడుతున్నారో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది.

వాస్తవానికి ఉత్సవాలు ఈ సంస్థల మనుగడలో భాగమై పోయాయి. సంబరాలు జరుపుకోవడం జీవితంలో భాగమే కానీ, మరీ ఇన్ని సంస్థలు, ఇన్ని సంబరాలా? అన్ని సంస్థలు కలిసి వచ్చి ఒక పెద్ద సమావేశం ఎందుకు జరుపుకోకూడదు? అన్ని సంస్థలు అదే రాజకీయ నాయకులను (ఎవరైతే అధికారంలోకి ఉంటారో) ముఖ్య అతిధులుగా ఆహ్వానిస్తారు. దాదాపు అందరు అదే సినీ తారలను ఆహ్వానిస్తారు. అనేక సందర్భాల్లో భారతదేశం నుండి వచ్చిన ఈ అతిథులు ఒక సమావేశం నుండి ఇంకొక సమావేశానికి షటిల్ చేస్తూ ఇబ్బంది పడుతుంటారు, ఎందుకంటే దాదాపు అన్ని సమావేశాలు ఓకే సారి జరుగుతుంటాయి.

ఈ రాజకీయవేత్తలు నాయకులుగా మారింది, అధికారంలోకి వచ్చింది స్వదేశంలో ఉన్న మన సోదర, సోదరీమణులు వారికి ఓట్లు వెయ్యడం వల్ల, అంతేకాని ఎన్నారైల వల్ల కాదు. ఆ సినీ నటులు ప్రసిద్ధి చెందింది స్వదేశంలో ఉన్న మన సోదర, సోదరీమణులు వారి చిత్రాలు చూసారు కాబట్టి, కాని ఎన్నారైల వల్ల కాదు. కానీ, అదే సోదర, సోదరీమణులు స్వదేశంలో కరువు కాటకాలతో ఇబ్బందులు పడుతూ, కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ఎన్నారైలు సహాయం అందించడానికి బదులు, ఈ నాయకుల చుట్టూ, సినీ తారల చుట్టూ తిరుగుతూ, వాళ్ళతో కలిసి సంబరాలు చేసుకోవడం న్యాయమా? స్వదేశంలో ఉన్న వారిని ఆదుకోవడం ఈ సంస్థల విధి కాకపోవచ్చు, కానీ అదే సమయంలో, ఆ నాయకులు, తారలను ఎన్నారైలు స్వంత వారిగా భావించే హక్కు కూడా లేదు.

ఎన్నారైలు చాలా చదువుకున్న వారు, స్వదేశంలో ఉన్న ప్రజల కన్నా ఎక్కువ తెలిసిన వారు. ఎన్నారైలు వినూత్నంగా ఆలోచించి, సొంత ప్రజలను ఆదుకుంటారని అందరూ ఆశిస్తుంటారు. మూడు రోజుల సరదాని (సాధారణంగా, ప్రతి సదస్సు మూడు రోజులు ఉంటుంది) త్యాగం చెయ్యడం ఒక పెద్ద విషయం కాదు. ఆ సినీ తారలు, రాజకీయ నాయకులను, ఈ సంస్థలకు అమెరికా తీసుకుని రాకపోతే వారు కోల్పోయేదేమీ లేదు.

కానీ కేవలం ఒక్కొక్క సినీ తారకు ఈ సంస్థలు పెట్టే బిజినెస్ క్లాసు విమాన టికెట్టుతో, మాతృ దేశంలో ఒక కుటుంబం ఒక సంవత్సరం పాటు బ్రతుకుతుంది. ఒక్కొక్క రాజకీయ నాయకునికి వీళ్ళు పెట్టే 5 నక్షత్రాల హోటల్ ఖర్చుతో 5-10 విద్యార్థులు సంవత్సరం పాటు చదువుకోవచ్చు. అయినా ఈ సినీ తారలు, రాజకీయ నాయకులు, ఈ సమావేశాలకు రావడం వల్ల ఎన్నారైలకు గాని, ఈ సంస్థలకు గాని ఒరిగే ప్రయోజనం ఏంటి? వారు అలా వచ్చి గరిష్టంగా 5 -10 నిమిషాలు వేదికపై కనిపిస్తారు, దాని కోసం ఈ సంస్థలు వారికి కనీసం 6 నెలల ప్రచారం కల్పిస్తారు.

ఈ సంస్థల పెట్టుబడితో ఆ నాయకులు, సినీ తారలు వారి సెలవులు ఆనందిస్తారు. వారికి ఇక్కడ లభించే రెడ్ కార్పెట్ ఆతిధ్యం బహుశా భారత దేశంలో కూడా లభించకపోవచ్చు. అసలు ఆ సంస్థల పెట్టుబడికి వచ్చే లాభం ఏంటి అంటే, ఈ సంస్థలకు చెందిన నాయకులు, ఆ సినీ, రాజకీయ ప్రముఖులతో సేల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పెట్టుకుంటారు, అంతకు మించి వచ్చే లాభం ఏమి లేదు.

నిజం, ఇది చాలా వాస్తవం. ఈ మూడు రోజుల సమావేశాలు నాటకీయంగా జరుగుతాయి. మొదటి రోజు జరిగే విందు అంతా ఆ సంస్థ నాయకత్వానికి బాకా ఊదటంతో పాటు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చిన ధనవంతులను పొగడటంతోనే సరిపోతుంది. ఇక రెండవ రోజున జరిగే చర్చా గోష్టిలు అన్నీ వినే వాళ్ళకన్నా చెప్పేవాళ్ళు ఎక్కువ అన్నట్టు సాగుతాయి, ఎవరో ప్రముఖులు హాజరయ్యే ఏదో ఒకటీ అరా చర్చా గోష్టి తప్ప.

ఇక మూడవ రోజున జరిగే "ప్రైమ్ టైం షో" కోసం అందరూ ఎదురు చూస్తుంటే, భారత దేశం నుంచి వచ్చిన నాయకులు, తారలు, ఒక 5 నుంచి 10 నిమిషాలు వేదిక మీద కనిపించి హడావుడి చేస్తారు. కొన్ని సంస్థలు నిర్వహించిన మునుపటి సమావేశాల్లో భోజనాల దగ్గర కొట్లాటలు జరిగినట్టు వార్తలు కూడా వచ్చాయి. అసలు ఈ సమావేశాలకు హాజరయ్యే వాళ్ళు ఏం చేస్తారు అని విశ్లేషిస్తే, సగం మంది వాళ్ళ బంధువులను, స్నేహితులను కలిసి, తాగి, తిని హోటల్ రూముల్లో పేకాటలాడుకుంటూ సమయం గడుపుతారు, ఇంకో సగం మంది అక్కడ పెట్టిన నగలు, చీరాల దుకాణాల్లో షాపింగ్ చేసుకుంటూ గడుపుతారు. ఈ సమావేశాలకు హాజరయ్యే ఎన్నారైలు కూడా తమ డబ్బును, సమయాన్ని ఎలా ఖర్చు పెడుతున్నారో పునః పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది.

స్వదేశంలో జరుగుతున్న రాజకీయాల గురించి, మన సమాజం ఎలా విశ్చిన్నం అవుతున్న దాని గురించి, ఎన్నారైలు తెగ బాధ పడుతుంటారు, కాని కేవలం తెలుగు వాళ్ళ కోసం ఇన్ని సంస్థలు ఎందుకు స్థాపిస్థున్నారో ఎవరు మాట్లాడరు. తెలుగు వారు రెండు రాష్ట్రాలుగా విడిపోయారు కాబట్టి, ఒక్కో రాష్ట్రానికి ఒక సంస్థ ఉండటం సముచితం, కానీ మరీ ఇన్ని సంస్థలా? ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా, ఈ సంస్థలు కులాల పేరు మీద విభజించబడ్డాయి, వారి నాయకత్వంలో ఉన్న వాళ్ళ పేర్లు గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఒకే కులానికి చెందినా, ఒక వర్ఘం వాళ్లకు నాయకత్వం దక్కకుంటే, వాళ్ళు వెళ్లి ఇంకో కొత్త సంస్థ ప్రారంభిస్తారు. ఇలా ఇంకెన్నాళ్ళు విభజించుకుంటూ వెళ్తారు?

ప్రతి సంస్థ దాని ట్యాగ్ లైన్ లో "సంస్కృతి", "సేవ" ఉంది. నిజంగా ఈ సంస్థలు, అమెరికాలో మన "సంస్కృతి" ప్రోత్సహించడానికి ఏమి చేస్తున్నాము అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పండుగల పేరు చెప్పి వాళ్ళలో వాళ్ళు, తాగి, తినడం తప్ప, తదుపరి తరం పిల్లలకు కనీసం ఆ పండుగల ఆవశ్యకతను కూడా చెప్పరు.

ఈ సంస్థలన్నీ మొదటి తరం ఎన్నారైలతో పాటు అంతరించి పోవాల్సిందే. రెండవ తరం వాళ్లకు ఈ సంస్థలు ఏం చేస్తున్నది, ఎలా విడిపోతున్నది తెలుసు. కొన్ని సంస్థలకు సభ్యుల కన్నా నాయకులే ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తున్నది, వాళ్ళు ఇచ్చే పత్రికా ప్రకటనలు చూస్తే, చాంతాడంత పేర్ల జాబితాలో అసలు విషయం ఎక్కడో ఒక మూలన కప్పి పెట్టి ఉంటుంది. ఏ ప్రకటన చూసినా అవే పేర్లు కనిపిస్తాయి.

మన దేశంలో పరిస్థితులు గమనిస్తే గుండె తరుక్కుపోతుంది. హైదరాబాద్ బయట ఉన్న వాళ్లకి ఒక్క ఫోన్ చేస్తే పరిస్థితి ఎంత హృదయ విదారకంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. కేవలం ప్రభుత్వాలు మాత్రమే అన్నీ చెయ్యలేవు, ఈ ఎన్నారై సంస్థల లాంటి స్వచ్చంద సంస్థలు, ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు చెయ్యొచ్చు. మన తోటి సోదర, సోదరీమణులు కరువుతో విల విల లాడుతుంటే, మనం సంబరాలు చేసుకోవడం న్యాయమా? వారికి ఎలాంటి సహాయం చెయ్యకపోయినా, సంబరాలు చేసుకోకుండా, వారికి సంఘీభావంగా నిలబదలేమా? ఈ సమావేశాలు అన్నీ రద్దు చేసి, ఆ సంస్థలు ఈ సమావేశాలకి పెట్టే ఖర్చును, వాళ్ళ సభ్యులందరూ, ఎదో ఒక సహాయ కార్యక్రమానికి విరాళంగా ఇవ్వమని ఒక బలమయిన సందేశం ఇవ్వలేవా?

ఎన్నారైలు అందరూ ఈ సంస్థల్లో సభ్యులు కాకున్నా, అదృష్టమో, దురదృష్టమో, ఈ సంస్థలు తమకు తాము ఎన్నారైలందరికీ ప్రతినిధులుగా మీడియా ముందు ప్రకటించుకోవడం జరుగుతుంది. ఈ సంస్థలు చేసే పనులన్నీ ఎన్నారైలు చేస్తున్నవిగా ప్రచారం జరుగుతుంది, కాబట్టి ఈ సంవత్సరం సంభవించిన విపత్కర పరిస్థితులకు, ఈ సమస్థలు ప్రతిస్పందించకుండా, సంబరాలు జరుపుకుంటుంటే, ఎన్నారైలందరూ నాన్ రెస్పాన్సివ్ ఇండియన్స్ గా పిలవబడుతున్నారు.

అలా అని ఈ సంస్థలన్నిటినీ తప్పుగా భావించలేము, ఒకటి రెండు సంస్థలు అమెరికాలో కొన్ని చాలా మంచి పనులు కూడా చేస్తున్నాయి. మన వాళ్లకి ఇక్కడ దుర్ఘటనలు జరిగి, ఎవరన్నా ప్రమాదవశాత్తు మరణించినప్పుడు, తీవ్రమయిన ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నప్పుడు ఈ సంస్థల్లో కొన్ని సంస్థలు చాల వేగంగా స్పందించి సహాయం అందించిన సందర్భాలు అనేకం.

ఈ సంస్థలు చేసే సేవా కార్యకలాపాలు మొత్తం సమాజంలో అన్ని వర్గాల వారికి విస్తరింప చేయాల్సిన సమయం ఆసన్నమయ్యింది. మన దేశంలో ఉన్న నిరుపేదలయిన మన తోటి తెలుగు వాళ్లకి మనం అందించే స్వచ్ఛంద సహాయం, కష్ట కాలంలో వారికి సంఘీభావం తెలిపే 'సంస్కృతి' అందరికీ వ్యాపింప చేసి, ఎన్నారైల మీద ఉన్న 'నాన్ రెస్పాన్సివ్ ఇండియన్స్' అనే అపోహను తొలగించాల్సిన బాధ్యత ఈ సంస్థల మీద ఉన్నది. ఆ దిశగా ఈ సంస్థలన్నీ కృషి చేస్తాయని, ఈ సంవత్సరం జరిపే సమావేశాలను తగ్గించుకోవడం ద్వారా మన తోటి తెలుగు వాళ్లకి అండగా నిబడుతాయని ఆశిద్దాం.

- నర్రా గోపి కృష్ణ

గమనిక: ఈ వ్యాసంలో రాసిన అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం

(ఈ వ్యాసంపై చర్చను ఆహ్వానిస్తున్నాం. వాటిని వెంటవెంటనే ప్రచురిస్తున్నాం. మీ అభిప్రాయాలు పంపాల్సిన మెయిల్ అడ్రస్ [email protected] - ఎడిటర్)

English summary
Narra Gopi on NRI organisations
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X