నిద్రిస్తున్న మహిళను ఎత్తుకెళ్లి గ్యాంగ్‌రేప్ చేశారు
నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు నిద్రపోతున్న ఓ వివాహితను ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడు మండలంలోని ఓ గ్రామంలో సోమవారం పోలేరమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అదే గ్రామ బీసీకాలనీకి చెందిన మండపల్లి కొండలు, దేవండ్ల రమణయ్య, దేవండ్ల మాధవ అనే ముగ్గురు యువకులు మద్యం సేవించారు.

ఆ తర్వాత వీరు గ్రామ శివారులో ఉన్న ఇంటిలో కుటుంబ సభ్యులతో కలిసి నిద్రిస్తున్న వివాహిత మహిళ(27)ను నోరుమూసి పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయంపై తీవ్ర ఆందోళనకు గురైన ఆ కుటుంబీకులు, బాధితురాలు బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
దీంతో గురువారం ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్య పరీక్షలు చేయించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన కావలి డిఎస్పీ బాలవెంకటేశ్వర్లు సాక్షులను విచారించారు. నిందితులైన యువకులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications