దళపతి విజయ్ జాతకంలో 'రాజయోగం': ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టిన గ్రహాలు
తమిళనాట 'దళపతి' విజయ్ సృష్టించిన రాజకీయ సునామీ వెనుక కేవలం ప్రజాకర్షణ మాత్రమే కాదు, బలమైన గ్రహబలం కూడా ఉందనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అరంగేట్రంలోనే అఖండ విజయాన్ని అందుకున్న విజయ్ జాతకంలో ఎలాంటి రాజయోగాలు ఉన్నాయి? ఆయన భవిష్యత్తుపై జ్యోతిష్య పండితుల అంచనా ఏంటి? అనేది తెలుసుకుందాం.
విజయ్ జాతకంలో 'రాజయోగం
విజయ్ కర్కాటక రాశి, పునర్వసు నక్షత్రం నాలుగో పాదంలో జన్మించారు. పునర్వసు అంటేనే 'మళ్లీ వికసించడం' లేదా 'పునర్జన్మ' అని అర్థం. సినీ రంగంలో శిఖరాగ్ర స్థాయిని చూసిన విజయ్, ఇప్పుడు ప్రజా సేవలో సరికొత్త అవతారం ఎత్తడానికి ఈ నక్షత్ర బలమే కారణమని పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ నక్షత్రానికి అధిపతి గురుడు కావడంతో, విజయ్‌కు అపారమైన ఓర్పుతో పాటు శత్రువులను కూడా శాంతియుతంగా ఎదుర్కొనే శక్తి లభించింది. ప్రస్తుతం ఆయనకు గోచార రీత్యా గురు బలం తోడవ్వడం వల్లే ఈ అద్భుత విజయం సాధ్యమైందని తెలుస్తోంది.

ప్రజాకర్షణకు 'జనవశ్య యోగం'
విజయ్ జాతకంలో అత్యంత అరుదైన 'జనవశ్య యోగం' ఉంది. ఈ యోగం ఉన్న వ్యక్తులకు ప్రజలను ఇట్టే మాయ చేయగల లేదా తమవైపుకు తిప్పుకోగల సమ్మోహన శక్తి ఉంటుంది. దీనికి తోడు వృత్తి స్థానం (10వ ఇల్లు), లాభ స్థానం (11వ ఇల్లు) జాతక చక్రంలో అత్యంత బలంగా ఉండటంతో రాజకీయాల్లో అప్రతిహత విజయం దక్కింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. 50 ఏళ్లు దాటిన తర్వాత పట్టే రాజయోగం చాలా కాలం స్థిరంగా ఉంటుంది. విజయ్‌కు సరిగ్గా 50 ఏళ్ల వయసులోనే ఈ విజయం దక్కడం చూస్తుంటే, ఆయనకు రాజకీయంగా స్వర్ణయుగం మొదలైందని పండితులు చెబుతున్నారు.
పదవీ గండం పొంచి ఉందా?
వెలుగు ఉన్నచోటే నీడ ఉన్నట్టుగా, విజయ్ జాతకంలో రాహువు ప్రభావం కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం గురు, శుక్ర గ్రహాల అనుకూలతతో రాజయోగం నడుస్తున్నప్పటికీ, భవిష్యత్తులో రాహువు కారణంగా కొన్ని రాజకీయ చిక్కులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా శత్రువులు ఆయన పదవికి ఆటంకాలు కలిగించే అవకాశం ఉందని, పటిష్టమైన వ్యూహాలు లేకపోతే పదవీ గండం తప్పదని జ్యోతిష్య వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అప్రమత్తంగా ఉంటూ, వ్యూహాత్మక అడుగులు వేస్తేనే ఈ అధికారం సుస్థిరంగా ఉంటుంది.
వైవాహిక జీవితం - రెండో పెళ్లి వార్తలు
గత కొంతకాలంగా విజయ్ వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా భార్య సంగీతతో విడాకులపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన రెండో వివాహంపై కూడా చర్చలు మొదలయ్యాయి. అయితే, విజయ్ జాతకం ప్రకారం.. ఆయన వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు, మనస్పర్థలు ఉన్న మాట వాస్తవమే కానీ, రెండో పెళ్లికి సంబంధించిన బలమైన యోగాలు ఏమీ కనిపించడం లేదని పండితులు స్పష్టం చేస్తున్నారు. రాబోయే కాలంలో ఆయన దృష్టి వ్యక్తిగత జీవితం కంటే పూర్తిగా ప్రజా సేవపైనే ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications